Suresh Kumar: టాలీవుడ్ లో విషాదం.. నటుడు సురేశ్ కుమార్ కన్నుమూత
- బ్యాంకింగ్ రంగ నిపుణుడిగా సురేశ్ కుమార్ కు గుర్తింపు
- కార్పొరేట్ ప్రపంచంలో బిజీగా ఉన్నప్పటికీ నటనపై మక్కువ
- అమితాబ్ తో కలిసి పలు చిత్రాల్లో నటించిన సురేశ్
టాలీవుడ్ నటుడు, బ్యాంకింగ్ రంగ నిపుణుడు, సీనియర్ పాత్రికేయుడు సి. సురేశ్ కుమార్ అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశారు. మూడు దశాబ్దాలకు పైగా మల్టీనేషనల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఉన్నత పదవుల్లో పనిచేస్తూనే, నటనపై ఉన్న మక్కువతో రంగస్థలం నుంచి వెండితెర వరకు తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రతిభావంతుడు ఆయన.
కార్పొరేట్ ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నా, తనలోని కళాకారుడిని ఎప్పుడూ మరచిపోలేదు. ముంబై, హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్ గ్రూపుల్లో కీలక సభ్యుడిగా ఉండి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ భాషల్లో నాటకాలు ప్రదర్శించారు.
ఢిల్లీ, జమ్మూ, బికనీర్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. వెండితెరపై కూడా సురేశ్ కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'సర్కార్ రాజ్', 'మద్రాస్ కేఫ్', 'మోడ్' వంటి హిందీ చిత్రాల్లో నటించారు.
తెలుగు ప్రేక్షకులకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'మహానటి', 'గోల్కొండ హైస్కూల్' వంటి సూపర్ హిట్ సినిమాల్లో కనిపించి సుపరిచితులయ్యారు. కమర్షియల్ సినిమాలతో పాటు ఇంగ్లీష్, తమిళ ఆర్ట్ ఫిలిమ్స్‌లోనూ నటించి తన వైవిధ్యాన్ని చాటుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.