Chandrababu Naidu: ఆ కిక్ కోసమే మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Work together for success kick
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఎస్ఐపీబీ సమావేశం
  • గత ప్రభుత్వంలో పోయిన బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు తిరిగి వచ్చిందన్న చంద్రబాబు
  • టాటా, అదానీ, రిలయెన్స్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడి
  • రూ.4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించిందని వివరణ
  • 2026లోనూ ఇదే ఉత్సాహంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం
"సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది. ఆ కిక్ కోసమే మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. పాలనలో వేగాన్ని పెంచి, ప్రజలకు వేగంగా సుపరిపాలన ఫలాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. 2025లో సాధించిన విజయాల స్ఫూర్తితో 2026లోనూ అదే ఉత్సాహంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం నాడు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) 14వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరి సమష్టి కృషితోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా దెబ్బతిన్న 'బ్రాండ్ ఏపీ'ని తిరిగి నిలబెట్టగలిగామని చంద్రబాబు అన్నారు. "2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పనిచేశారు. మన టీమ్‌వర్క్ ఫలితంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివచ్చాయి. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి" అని ఆయన వివరించారు. ఈ క్రమంలో ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

విద్యుత్ రంగంలో ప్రభుత్వం సాధించిన విజయాలను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. "విద్యుత్ ఛార్జీలను 13 పైసలు తగ్గించాం. ప్రజలపై రూ.4,500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని మోపకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాం. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.3.70కి తగ్గించడమే లక్ష్యం. విద్యుత్ రంగంలో మనం చేసిన కృషి వల్లే రాష్ట్రానికి డేటా సెంటర్లు వస్తున్నాయి" అని చంద్రబాబు పేర్కొన్నారు.

దావోస్ పర్యటన ద్వారా ఏపీ బ్రాండ్‌ను ప్రపంచానికి ప్రమోట్ చేయగలిగామని, విదేశీ కంపెనీలను ఆకర్షించడంలో విజయం సాధించామని తెలిపారు. గూగుల్ సెంటర్‌ను రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి నారా లోకేశ్ ఎంతో కృషి చేశారంటూ అభినందించారు. 

కాగా, ఈ 14వ ఎస్‌ఐపీబీ సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో పలు కీలక పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. గత 13 సమావేశాల్లో రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు, 8.23 లక్షల ఉద్యోగాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపిన విషయాన్ని అధికారులు గుర్తుచేశారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, టీజీ భరత్... సీఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AP investments
Nara Lokesh
SIPB meeting
AP brand
Power sector AP
Data centers AP
AP development
Davos AP

More Telugu News