Rukmini Vasanth: కీలక పాత్రలో రుక్మిణి వసంత్.. 'టాక్సిక్' నుంచి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Rukmini Vasanths Stunning First Look Released from Toxic
  • మూవీలో 'మెలిస్సా' అనే కీలక పాత్రలో నటిస్తున్న రుక్మిణి
  • ఇప్పటికే కియారా, నయనతార, హ్యూమా ఖురేషిల‌ లుక్స్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ 
  • రుక్మిణి నటనపై దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ప్రశంసల వర్షం
  • 2026 మార్చి 19న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు
పాన్-ఇండియా స్టార్ యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ సినిమా నుంచి మేకర్స్ ఈరోజు మరో కీలక అప్‌డేట్ ఇచ్చారు. చిత్రంలో నటిస్తున్న రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె 'మెలిస్సా' అనే పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

1960ల కాలం నాటి పార్టీ నేపథ్యంలో ఉన్న ఈ పోస్టర్‌లో రుక్మిణి ఆకట్టుకుంటున్నారు. చుట్టూ సందడి వాతావరణం ఉన్నా, ఆమె మాత్రం తన లక్ష్యంపై దృష్టి సారించినట్టుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కియారా అద్వానీ (నాడియా), హ్యూమా ఖురేషి (ఎలిజబెత్), నయనతార (గంగ), తారా సుతారియా (రెబెక్కా) వంటి స్టార్ల ఫస్ట్ లుక్స్‌ను విడుదల చేయగా, తాజాగా రుక్మిణి చేరికతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సందర్భంగా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. "రుక్మిణిలోని తెలివైన నటి నాకు బాగా నచ్చుతుంది. ఆమె కేవలం నటించడమే కాదు, పాత్రను అర్థం చేసుకుని ముందుకు వెళుతుంది. ఆమె అడిగే ప్రశ్నలు ఒక దర్శకురాలిగా నన్ను కూడా లోతుగా ఆలోచింపజేస్తాయి" అని ప్రశంసించారు.

యశ్, గీతూ మోహన్‌దాస్ కలిసి రాసిన ఈ కథను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. తర్వాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో డబ్ చేసి విడుదల చేయనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీతో పాటు అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేక‌ర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.
Rukmini Vasanth
Toxic movie
Yash
Geetu Mohandas
Melissa character
Kannada movie
Indian cinema
KVN Productions
Action thriller
Nayanthara

More Telugu News