Sonia Gandhi: మరోసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సోనియాగాంధీ
- దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న సోనియా
- సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరిక
- సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. సీనియర్ పల్మోనాలజిస్ట్ (ఊపిరితిత్తుల నిపుణుడు) నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది.
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం చాలా ఘోరంగా ఉంది. దీని కారణంగానే ఆమె అనారోగ్యానికి గురైనట్టు వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఆమె శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డారు. గత డిసెంబర్ లో సోనియా 79వ పుట్టినరోజును జరుపుకున్నారు.
మరోవైపు, సోనియా ఆసుపత్రిలో చేరారన్న వార్తతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇంకోవైపు, సోనియా ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.