Mustafizur Rahman: తప్పేమీ లేకున్నా భారీ నష్టం... రూ.9.20 కోట్లు కోల్పోయిన బంగ్లా పేసర్!

Mustafizur Rahman Faces Huge Loss Due to KKR IPL Contract Termination
  • బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజుర్‌ను వదులుకున్న కేకేఆర్‌
  • రూ.9.20 కోట్ల ఐపీఎల్ జీతం కోల్పోనున్న బంగ్లా పేస‌ర్‌
  • పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఫ్రాంచైజీకి లేదన్న ఐపీఎల్‌ వర్గాలు
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. అతడిని ఐపీఎల్ కాంట్రాక్ట్ నుంచి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక బీసీసీఐ ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో వేలంలో రూ.9.20 కోట్లకు అమ్ముడైన ముస్తాఫిజుర్.. తన తప్పేమీ లేకపోయినా ఆ మొత్తాన్ని పూర్తిగా కోల్పోనున్నాడు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీవ్రంగా స్పందించింది. దీనికి ప్రతీకార చర్యగా, త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని డిమాండ్ చేసింది.

ఇక‌, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల జీతాలకు బీమా సౌకర్యం ఉంటుంది. అయితే, టోర్నమెంట్ సమయంలో గాయపడితేనే ఫ్రాంచైజీలు పరిహారం చెల్లిస్తాయి. ముస్తాఫిజుర్ విషయంలో ఇది గాయం లేదా ఆట సంబంధిత కారణం కాదు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు అతడిని జట్టు నుంచి తొలగించారు. దీంతో కాంట్రాక్ట్ ప్రకారం అతనికి ఎలాంటి మొత్తం చెల్లించాల్సిన బాధ్యత కేకేఆర్‌పై లేదని ఐపీఎల్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ నిర్ణయంపై ముస్తాఫిజుర్ న్యాయపరంగా పోరాటం చేసే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఐపీఎల్ భారత చట్టాల పరిధిలోకి వస్తుంది. పైగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ సంబంధాలు సున్నితంగా ఉన్న తరుణంలో న్యాయపోరాటానికి దిగడం వల్ల భవిష్యత్తులో తన అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఆటగాడి ప్రమేయం లేని రాజకీయ కారణాలతో అతడు భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Mustafizur Rahman
Mustafizur Rahman IPL
Kolkata Knight Riders
BCCI
Bangladesh Cricket Board
T20 World Cup
India Bangladesh relations
IPL contract
Hindu attacks Bangladesh
Sports politics

More Telugu News