Poonam Kaur: పోసానిపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.. తన జీవితం నాశనం అయిపోయిందని వ్యాఖ్య
- పోసాని ప్రెస్ మీట్ తన జీవితాన్ని నాశనం చేసిందన్న పూనమ్ కౌర్
- పోసాని వల్ల తన పెళ్లి కూడా ఆగిపోయిందని ఆవేదన
- ఆ ఘటనతో తన తల్లికి గుండెపోటు వచ్చిందని వెల్లడి
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన సినీ నటి పూనమ్ కౌర్ తాజాగా నటుడు పోసాని కృష్ణమురళిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక యూట్యూబ్ ఛానెల్‌లో జర్నలిస్ట్ అంజలికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ఎలా నాశనమయ్యాయో వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందులో ముఖ్యంగా నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతూ, అది తన జీవితాన్ని మలుపు తిప్పిందని, అంతా కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
పూనమ్ మాట్లాడుతూ, "నేను ఒక పెద్ద మనిషి దగ్గర డబ్బులు తీసుకుని రాజీపడ్డానని తప్పుడు ప్రచారం చేశారు. అది నా తల్లిని ఎంత బాధపెట్టిందంటే, ఆమె గురుద్వారాకు వెళితే జనాలు 'కూతురిని డబ్బు కోసం అమ్మేశావా?' అని అడిగారు. మా బంధువులు కూడా నన్ను నమ్మలేదు. నన్ను తొక్కేయడానికి కొందరు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు" అని సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల వల్ల తన పెళ్లి ఆగిపోయిందని చెప్పింది. "నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక స్నేహితుడు ముందుకు వచ్చిన సమయంలో, పోసాని ప్రెస్ మీట్ పెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. దాంతో అతను దూరమయ్యాడు. ఆ ఘటన తర్వాత మా అమ్మకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది. ఆ ఒక్క ప్రెస్ మీట్ నా ఆరోగ్యం, సంతోషం, కెరీర్... అన్నింటినీ నాశనం చేసింది" అంటూ ఎమోషనల్ అయింది.
ఇంకా ఆమె దర్శకుడు దాసరి నారాయణరావు గురించి గుర్తు చేసుకుంది. "ఆయన బతికి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు" అని చెప్పింది. ఫేక్ న్యూడ్ ఫొటోలు, రాహుల్ గాంధీతో అఫైర్ రూమర్లు, అబార్షన్ వంటి తప్పుడు వార్తల గురించి కూడా మాట్లాడింది. ఇవన్నీ తనను మానసికంగా కుంగదీశాయని, ఇండస్ట్రీలో ఎవరూ మద్దతు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. కొందరు పూనమ్‌కు మద్దతుగా మాట్లాడుతుంటే, మరికొందరు ఈ వివాదాలపై చర్చలు జరుపుతున్నారు. ఒక యూజర్ "ఆమెను హగ్ చేసుకుని ఓదార్చాలనిపిస్తోంది, ఆమె సక్సెస్ అవ్వాలి" అని పోస్ట్ చేశాడు. మరోవైపు, పోసాని వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.