Nicolas Maduro: వెనెజువెలాలో ఉద్రిక్తత.. అధ్యక్ష భవనం వద్ద కాల్పులు

Nicolas Maduro Crisis in Venezuela Shooting at Presidential Palace
  • మిరాఫ్లోర్స్ అధ్యక్ష భవనం సమీపంలో భారీగా పేలుళ్లు, కాల్పులు
  • తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రిగ్జ్
  • వెనెజువెలాను తామే నడిపిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • అమెరికా చర్యను తప్పుబట్టిన భారత్, రష్యా, చైనా మరియు బ్రెజిల్
వెనెజువెలా రాజకీయ సంక్షోభం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు బందీగా పట్టుకున్న తర్వాత రాజధాని కారకాస్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా అక్కడి మిరాఫ్లోర్స్ అధ్యక్ష భవనం సమీపంలో భారీగా కాల్పులు, ఘర్షణలు జరిగాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, నగరం మొత్తం భయాందోళనలో మునిగిపోయింది.

మదురో గైర్హాజరీలో వెనిజువెలా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాతో చర్చలకు సిద్ధమని ఆమె సంకేతాలిచ్చారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనెజువెలాలో సరైన అధికార మార్పిడి జరిగే వరకు ఆ దేశాన్ని అమెరికా నడిపిస్తుందని స్పష్టం చేశారు.

అమెరికా తీరుపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందించారు. గతంలో గెరిల్లా పోరాటం చేసిన తాను మాతృభూమి రక్షణ కోసం మళ్లీ ఆయుధం పడతానని హెచ్చరించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా సైతం అమెరికా చర్యను తీవ్రంగా ఖండించారు. ఒక సార్వభౌమ దేశంపై బాంబులు వేయడం, అధ్యక్షుడిని పట్టుకోవడం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.

అమెరికా సైనిక చర్యను రష్యా, చైనా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది ఒక దేశంపై జరిగిన సాయుధ దురాక్రమణ అని రష్యా అభివర్ణించగా, ఒక దేశాధ్యక్షుడిపై బలాన్ని ప్రయోగించడం దిగ్భ్రాంతికరమని చైనా పేర్కొంది.

ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెనెజువెలా ప్రజల క్షేమం తమకు ముఖ్యమని, అన్ని పక్షాలు శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతినకుండా చూడాలని భారత్ కోరింది.
Nicolas Maduro
Venezuela crisis
Delcy Rodriguez
Donald Trump
Gustavo Petro
Lula da Silva
US intervention
Venezuela politics
Miraflores Palace
South America

More Telugu News