Thailand: థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్ జెండర్ల దాడి

Raj Jasuja Attacked by Transgenders in Thailand
  • థాయ్‌లాండ్‌లోని పట్టాయ వీధిలో ఘటన 
  • డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో భారతీయుడిపై కొందరు ట్రాన్స్‌జెండర్ సెక్స్‌ వర్కర్లు మూకుమ్మడి దాడి 
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
థాయ్‌లాండ్‌లో ఓ భారతీయుడిపై స్థానిక ట్రాన్స్‌జెండర్ల గుంపు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన గత నెల 27న పట్టాయ వీధిలో చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో కొందరు ట్రాన్స్‌జెండర్‌ సెక్స్‌ వర్కర్లు ఆ భారతీయుడిపై మూకుమ్మడిగా దాడి చేశారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితుడిని రక్షించారు.

దాడికి గురైన వ్యక్తిని రాజ్‌ జసూజా (52)గా గుర్తించారు. ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో మొదట ప్రాథమిక చికిత్స అందించి, ఆ తర్వాత పట్టామకూన్ ఆసుపత్రికి తరలించారు. రాజ్‌ జసూజాను ట్రాన్స్‌జెండర్‌లు వెంబడిస్తూ, కాలితో తన్నుతూ ఇష్టారీతిన దాడి చేసిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనకు ముందు బాధితుడికి, ఓ ట్రాన్స్‌జెండర్‌కు మధ్య వాగ్వాదం జరిగిందని స్థానికుడు ఒకరు మీడియాకు తెలిపారు. అనంతరం ఆ ట్రాన్స్‌జెండర్ తన స్నేహితులకు ఫోన్ చేసి పిలవడంతో వివాదం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారి దాడికి దారితీసిందని పేర్కొన్నారు. అయితే, గొడవకు అసలు కారణం ఏమిటనే దానిపై స్థానిక అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని మాత్రమే వారు వెల్లడించారు. 
Thailand
Raj Jasuja
Thailand
Indian man attacked
Transgenders
Pattaya
Transgender attack
Crime
Social media video
Extortion

More Telugu News