Nicolas Maduro: నేను నిర్దోషిని.. అమెరికా కోర్టులో మదురో వాదన

Nicolas Maduro Pleads Innocence in US Court on Drug Charges
  • డ్రగ్స్ స్మగ్లింగ్, నార్కో టెర్రరిజం ఆరోపణలను తోసిపుచ్చిన నికోలస్ మదురో
  • తనను బందీగా పట్టుకున్నారని, తానే ఇప్పటికీ అధ్యక్షుడినని కోర్టులో వ్యాఖ్య
  • మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ కూడా కోర్టుకు హాజరు
  • అమెరికా చర్యపై రష్యా, చైనా ఆగ్రహం
ప్రపంచ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ ఉదంతం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం వంటి తీవ్రమైన ఆరోపణలపై న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరైన మదురో తాను నిర్దోషినని వాదించారు. కారకాస్‌లోని అధ్యక్ష భవనం నుంచి తనను బలవంతంగా బందీగా పట్టుకున్నారని న్యాయమూర్తికి తెలిపారు.

"నేను మర్యాదస్తుడిని, నా దేశానికి అధ్యక్షుడిని. ఇక్కడ మోపిన ఆరోపణలేవీ నిజం కావు. నేను నిర్దోషిని" అని 63 ఏళ్ల మదురో స్పష్టం చేశారు. తనను పదవి నుంచి తొలగించినప్పటికీ, తానే ఇప్పటికీ వెనిజువెలా నాయకుడినని ఆయన పునరుద్ఘాటించారు. మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ కూడా కోర్టుకు హాజరై తాను వెనిజులా ప్రథమ మహిళనని, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు.

మదురోపై ప్రధానంగా నాలుగు రకాల ఆరోపణలు ఉన్నాయి. నార్కో టెర్రరిజం, కొకైన్ దిగుమతికి కుట్ర, విధ్వంసకర ఆయుధాలు (మెషిన్ గన్స్) కలిగి ఉండటం, మెక్సికోలోని సినలోవా, జెటాస్ కార్టెల్స్, కొలంబియా తిరుగుబాటుదారులతో కలిసి డ్రగ్స్ నెట్‌వర్క్ నడపడం వంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వెనిజువెలా చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఈ తప్పుడు కేసులు పెట్టిందని మదురో డిఫెన్స్ టీమ్ వాదిస్తోంది.

మదురో అరెస్ట్ తర్వాత వెనిజువెలాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా చేపట్టిన ఈ ఆపరేషన్‌ను సమర్థించే వారిని అరెస్ట్ చేయాలని అక్కడి అధికారులు ఆదేశించారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా, చైనా సహా వెనిజువెలా మిత్రదేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 1989 పనామా దాడి తర్వాత లాటిన్ అమెరికాలో అమెరికా చేసిన అతిపెద్ద సైనిక చర్యగా దీన్ని అభివర్ణించారు.

అమెరికా భద్రతా దళాలు మదురో దంపతులను బ్రూక్లిన్ డిటెన్షన్ సెంటర్ నుంచి భారీ భద్రత మధ్య హెలికాప్టర్‌లో కోర్టుకు తరలించాయి. ఈ కేసు అంతర్జాతీయ న్యాయ సూత్రాల పరంగా అనేక చర్చలకు దారితీస్తోంది.
Nicolas Maduro
Venezuela
Drug trafficking
Narco-terrorism
US Court
Cilia Flores
Venezuela President
International Politics
New York Federal Court
Sinaloa Cartel

More Telugu News