Yarlagadda Venkatrao: జగన్ సర్కారు అక్రమాలను కాగ్ బట్టబయలు చేసింది: యార్లగడ్డ వెంకట్రావు

Yarlagadda Venkatrao Slams Jagan Govt Over CAG Report
  • నకిలీ బిల్లులు, అనధికార పెన్షన్లతో ఖజానాకు భారీ నష్టం జరిగిందని విమర్శ
  • పీపీపీ విధానం, భోగాపురం ఎయిర్‌పోర్టుపై వైసీపీది క్రెడిట్ చోరీ యత్నమని ధ్వజం
  • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషితోనే రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయని వెల్లడి
దేశంలోకి వచ్చిన పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. అదే సమయంలో, గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని, కాగ్ నివేదిక ఈ అక్రమాలను బట్టబయలు చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతోనే ప్రపంచ దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని తెలిపారు.

కాగ్ నివేదికతో అక్రమాలు బట్టబయలు
గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై కాగ్ ఇచ్చిన నివేదికను జగన్ ఓసారి చదువుకోవాలని వెంకట్రావు హితవు పలికారు. "సీఎఫ్ఎంఎస్‌లో డూప్లికేట్ బిల్లులను గుర్తించే వ్యవస్థ లేకపోవడంతో 1,41,917 బిల్లులకు అదనంగా రూ.968 కోట్లు చెల్లించారు. ఎలాంటి లిమిట్ చెక్ లేకుండా 2,545 మందికి అనధికారికంగా పెన్షన్లు చెల్లించి రూ.218.15 కోట్ల నష్టం చేకూర్చారు. 

పీడీ అకౌంట్ల నుంచి అధికారులకు తెలియకుండానే రూ.71,568 కోట్లు లాప్స్ చేశారు. రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.13,899 కోట్ల నుంచి రూ.43,487 కోట్లకు, ఆర్థిక లోటు రూ.52,508 కోట్లకు పెరిగిందని కాగ్ తేల్చింది. అప్పులు తెచ్చి అభివృద్ధికి ఖర్చు చేసింది కేవలం రూ.7,244 కోట్లే. దీనిపై జగన్ సమాధానం చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

పీపీపీ, భోగాపురంపై ఎదురుదాడి
రాష్ట్రంలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వైసీపీపై ఆయన మండిపడ్డారు. దేశంలోని పంజాబ్, బెంగాల్, యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాలు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేస్తుంటే, ఇక్కడ మాత్రం వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. "రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టే బదులు, సలహాదారులకు రూ.680 కోట్లు పెట్టే బదులు రెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చు. పీపీపీ విధానంపై నాతో బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా?" అని సవాల్ విసిరారు. 

ఇక భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని, ఐదేళ్లు నిర్మాణాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతోనే పనులు వేగవంతమై ట్రయల్ రన్ విజయవంతమైందని ఆయన స్పష్టం చేశారు.

పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ
బ్యాంక్ ఆఫ్ బరోడా-సీఎంఈఐ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, గడిచిన 9 నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడులలో 25.3 శాతం వాటాతో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. 

"సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అవిశ్రాంత శ్రమ వల్లే ఫార్చ్యూన్ 500 కంపెనీలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మా హయాంలో గన్నవరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న అశోక్ లే ల్యాండ్ కంపెనీ, వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఉత్పత్తి ప్రారంభించలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం రాగానే విశ్వాసంతో ఉత్పత్తి మొదలుపెట్టింది. మేధా టవర్స్‌లో మంత్రి లోకేశ్ మరిన్ని ఐటీ కంపెనీలను ప్రారంభించారు. కానీ, రాష్ట్రానికి మంచి జరగడం వైసీపీకి ఇష్టం లేదు" అని ఆయన అన్నారు.

Yarlagadda Venkatrao
Andhra Pradesh
AP investments
CAG report
Jagan government
TDP
Nara Lokesh
Chandrababu Naidu
Bhogaipuram airport
PPP model

More Telugu News