Shankar Das: శబరిమల బంగారం అదృశ్యం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Shankar Das Sabarimala Gold Missing Case Supreme Court Key Comments
  • దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదన్న సుప్రీంకోర్టు
  • దేవుడు, ఆలయం జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని వ్యాఖ్య
  • బంగారం అదృశ్యం కేసులో శంకర్‌దాస్ కూడా బాధ్యుడేనని వ్యాఖ్య
కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం అదృశ్యం వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయం జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు మాజీ సభ్యుడు శంకర్‌దాస్ కూడా బాధ్యుడేనని పేర్కొంది.

శబరిమల ఆలయంలో బంగారం అదృశ్యం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. 2019లో బంగారం పూత పూసిన రాగి రేకులను ఎలక్ట్రో ప్లేటింగ్ కోసం స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు అప్పగించారు. ఆ ప్లేట్ల మొత్తం బరువు 42.100 కిలోలు కాగా, ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైంది. దీనిపై సిట్ దర్యాప్తు జరిపింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి దానిని ప్రైవేటుగా మళ్లించాడని ఆరోపించారు. ఎలక్ట్రోప్లేటింగ్ అనంతరం ఉన్ని కృష్ణన్ తనకు 474.90 గ్రాముల బంగారం ఇచ్చాడని గోవర్ధన్ అనే మరో నిందితుడు చెబుతూ, ఆ బంగారాన్ని సిట్‌కు అప్పగించాడు.

కేసు విచారణలో భాగంగా గతంలో బోర్డు మాజీ సభ్యుడు శంకర్‌దాస్‌పై కేరళ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నేరపూరిత కుట్ర ఆరోపణల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న తీవ్ర వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ తాజాగా అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే న్యాయస్థానం అతని పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Shankar Das
Sabarimala
Sabarimala Temple
Kerala
Gold Missing Case
Travancore Devaswom Board

More Telugu News