Prabhas: ప్రభాస్ గురించి బోలెడు కబుర్లు చెప్పిన బొమన్ ఇరానీ

Boman Irani Shares Experience Working with Prabhas in The Raja Saab
  • ముంబైలో ది రాజాసాబ్ ప్రమోషనల్ ఈవెంట్
  • పాల్గొన్న బొమన్ ఇరానీ
  • ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అయినా గర్వం ప్రదర్శించడన్న బొమన్ ఇరానీ
  • సెట్‌లో అందరితో ఓ చిన్న పిల్లాడిలా అమాయకంగా ఉంటాడని ప్రశంస
  • జోకులు వేస్తూ, గట్టిగా నవ్వుతూ సరదాగా ఉంటాడని వెల్లడి
  • ప్రభాస్ వ్యక్తిత్వం తనకు స్ఫూర్తినిచ్చిందని వ్యాఖ్య
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'ది రాజాసాబ్'. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటుడు బోమన్ ఇరానీ, ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. సోమవారం ముంబైలో జరిగిన ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ, అతడిలో ఆ గర్వం కొంచెం కూడా కనిపించదని ప్రశంసించారు.

ఈ సందర్భంగా బోమన్ ఇరానీ మాట్లాడుతూ, "ప్రభాస్ గురించి జరీనా వాహబ్ గారు చాలా చక్కగా చెప్పారు. అంతకంటే గొప్పగా నేను చెప్పలేనేమో. కానీ సినిమాల్లో ప్రభాస్‌ను చూసినప్పుడు అతడి చుట్టూ ఓ ప్రత్యేకమైన ఆరా కనిపిస్తుంది. ఒక లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ ఉంటుంది. కాబట్టి బయట కూడా అతడొక సూపర్ స్టార్‌లా ప్రవర్తిస్తాడని మనం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. తన టీమ్ సభ్యులతో, తోటి నటీనటులతో, చిన్న పాత్రలు చేసేవారితో, టెక్నీషియన్లతో.. ఇలా సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభాస్ ఓ చిన్న పిల్లాడిలా మాట్లాడతాడు" అని వివరించారు.

"అతడిలో ఎంతో అమాయకత్వం, కుర్రాడితనం కనిపిస్తాయి. తన స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తాడు కానీ, ఆ హోదాను ఎప్పుడూ ఎదుటివారిపై రుద్దే ప్రయత్నం చేయడు. మేమంతా అతడిని సూపర్ స్టార్‌గా గుర్తిస్తాం, కానీ అతను మాత్రం అలా ప్రత్యేకంగా చూడవద్దని కోరుకుంటాడు. సెట్‌లో జోకులు వేయడం, నవ్వడం ప్రభాస్ కు చాలా ఇష్టం. ఎవరైనా చిన్న జోక్ చెప్పినా సరే.. అందరికంటే ముందు, అందరికంటే గట్టిగా, ఎక్కువ సేపు నవ్వేది ప్రభాసే. ఆ నవ్వు చూస్తుంటే ఇప్పటికీ ఓ టీనేజర్‌లా అనిపిస్తాడు" అని బోమన్ ఇరానీ అన్నారు.

"ఒక వ్యక్తి అంతటి ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా తనలోని అమాయకత్వాన్ని నిలుపుకోవడం నిజంగా అద్భుతమైన విషయం. అలాంటి వ్యక్తిత్వం నాకు కూడా ఉండాలనిపిస్తుంది" అంటూ ప్రభాస్ నిరాడంబరతపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ తన తప్పిపోయిన తాత కోసం వెతుకుతూ ఒక భవంతికి చేరుకుంటాడు. అక్కడ అతనికి ఎదురైన అనుభవాల చుట్టూ కథ నడుస్తుంది.

సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, జరీనా వాహబ్ వంటి ప్రముఖులు నటిస్తున్న 'ది రాజాసాబ్' చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prabhas
The Raja Saab
Boman Irani
Maruthi
Telugu Movie
Pan India Star
Sanjay Dutt
Nidhi Agarwal
Malavika Mohanan
Zareena Wahab

More Telugu News