Errol Musk: శ్వేతజాతీయులు మైనారిటీలుగా మారితే...!: ఎలాన్ మస్క్ తండ్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Errol Musk Controversial Remarks on Americas Future Population
  • శ్వేతజాతీయులు మైనారిటీలుగా మారితే దేశం కుప్పకూలుతుందన్న ఎరోల్ మస్క్
  • యూరోపియన్ సంస్కృతే దక్షిణాఫ్రికా అభివృద్ధికి కారణమని వెల్లడి
  • తన తండ్రి ఒక 'చెడు ప్రణాళికాకర్త' అని మండిపడిన ఎలాన్ మస్క్ 
  • తండ్రీకొడుకుల మధ్య కొనసాగుతున్న విభేదాలు
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ అమెరికా జనాభా మార్పులపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెను దుమారం రేపుతున్నాయి. రాబోయే రెండు దశాబ్దాల్లో అమెరికాలో శ్వేతజాతీయుల జనాభా మైనారిటీ స్థాయికి పడిపోతే ఆ దేశం పతనమవుతుందని హెచ్చరించారు. ఇది దేశానికి ‘చాలా చెడు పరిణామం’ అని ఆయన అభివర్ణించారు.

"మీరు అమెరికా పతనం కావాలని కోరుకుంటున్నారా? మీకు సాంకేతికత, ఎలక్ట్రిక్ కార్లు ఇష్టం లేదా? మళ్లీ ఆటవిక కాలానికి వెళ్లాలనుకుంటున్నారా?" అంటూ ఎరోల్ మస్క్ ప్రశ్నించారు. దక్షిణాఫ్రికా గురించి మాట్లాడుతూ.. అక్కడ కొద్దిమంది శ్వేతజాతీయులు ప్రవేశపెట్టిన యూరోపియన్ సంస్కృతే నల్లజాతీయుల అభివృద్ధికి తోడ్పడిందని పేర్కొన్నారు. అక్కడ వ్యవస్థీకృత అణచివేత ఉందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ తన తండ్రిని ‘అత్యంత చెడు వ్యక్తి’గా అభివర్ణించారు. "నా తండ్రి చాలా జాగ్రత్తగా చెడును ప్లాన్ చేస్తాడు. మీరు ఊహించగలిగే ప్రతి నేరాన్ని ఆయన చేసి ఉంటారు" అని సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిని మార్చేందుకు తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, ఆయన మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని ఎలాన్ స్పష్టం చేశారు.

ఎరోల్ మస్క్ జీవితం వివాదాలకు నిలయంగా మారింది. 1998లో ఆత్మరక్షణ కోసం ముగ్గురు వ్యక్తులను చంపినట్లు ఆయనే స్వయంగా అంగీకరించారు. అప్పట్లో ఆయన అరెస్ట్ అయినప్పటికీ, ఆ తర్వాత ఆరోపణలు వీగిపోవడంతో విడుదలయ్యారు. పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న జనాభా మార్పులపై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి మస్క్ కుటుంబంలోని అంతర్గత విభేదాలను, ఎర్రోల్ వివాదాస్పద ఆలోచనా ధోరణిని బయటపెట్టాయి.
Errol Musk
Elon Musk
America population
white minority
US decline
South Africa
racial issues
controversial statements
Errol Musk interview
population changes

More Telugu News