అమెరికాలో తెలుగమ్మాయి హత్య ..!

  • అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రం కొలంబియాలో నికిత గోడిశాల (27) హత్య
  • నికిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్జున్‌ శర్మ
  • అర్జున్ శర్మ నివాసం ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే నికిత మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
  • నిందితుడు అర్జున్ శర్మ జనవరి 2వ తేదీన అమెరికా విడిచి భారత్‌కు వెళ్లినట్లు గుర్తింపు 
తెలుగమ్మాయి  నికిత గోడిశాల (27) అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం కొలంబియా నగరంలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహాన్ని తన పూర్వ స్నేహితుడు నివసించిన అపార్ట్‌మెంట్‌లో పోలీసులు గుర్తించారు. అయితే, ఈ ఘటన వెలుగులోకి రాకముందే నిందితుడు దేశం విడిచి భారత్‌కు పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

నూతన సంవత్సర వేడుకల అనంతరం నికిత కనిపించడం లేదంటూ అర్జున్ శర్మ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబరు 31న చివరిసారిగా ఎల్లికాట్ సిటీలోని తన అపార్ట్‌మెంట్‌లో నికితను చూశానని అర్జున్ పోలీసులకు తెలిపాడు. అయితే, జనవరి 2వ తేదీన అతడు అమెరికా విడిచి భారత్‌కు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది.

అనుమానంతో పోలీసులు సెర్చ్ వారెంట్ ద్వారా అర్జున్ అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేయగా, నికిత మృతదేహం అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలున్నాయని, డిసెంబరు 31వ తేదీ రాత్రి 7.30 గంటల తర్వాత నికితను అర్జునే హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే, హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.

భారత్‌కు పరారైన అర్జున్ శర్మను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ఫెడరల్ అధికారుల సహకారం కోరినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు, నికిత ఆచూకీ కోసం ఆమె స్నేహితులు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే, ఆదివారం ఆమె హత్యకు గురైన విషయం తెలియడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సోషల్ మీడియా ఖాతాల ద్వారా నికిత కుటుంబ మూలాలు సికింద్రాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె భారత్‌లోని ఏ ప్రాంతానికి చెందినదనే విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 


More Telugu News