Telangana High Court: పోలీసు అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Telangana High Court Key Remarks on Police Officers Actions
  • సెర్చ్ వారెంట్లు జారీ చేసే అధికారం పోలీసులకు ఎక్కడదని ప్రశ్నించిన హైకోర్టు
  • ఏ నిబంధనలు, ఏ జీవో ఆధారంగా చేస్తున్నారో వివరాలు సమర్పించాలన్న హైకోర్టు
  • తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
తెలంగాణలో పోలీసుల చర్యలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులు తమంతట తాముగా సెర్చ్ వారంట్లు జారీ చేస్తుండటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సెర్చ్‌ వారంట్లు జారీ చేసే అధికారం పోలీసులకు ఎక్కడిదని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. 
 
పిటిషనర్ విజయగోపాల్ వ్యక్తిగత హోదాలో వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్‌ 93, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 47లను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌లకు మాత్రమే ఉన్న అధికారాలను వినియోగిస్తూ కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ పేరుతో తనిఖీలు చేపడుతున్నారని తెలిపారు. నేరస్థులు, అక్రమ వలసదారుల కోసం అంటూ సెర్చ్‌ వారంట్‌ లేకుండానే ఇళ్లలోకి ప్రవేశించి గుర్తింపు పత్రాలు అడుగుతున్నారని ఆరోపించారు.

వాదనలు విన్న ధర్మాసనం, సీఆర్పీసీ లేదా బీఎన్‌ఎస్‌లోని ఏ నిబంధనలు, జీవోల ఆధారంగా పోలీసులు సెర్చ్‌ వారంట్లు జారీ చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రజాభద్రత నిమిత్తం పోలీసులు చేస్తున్న కృషిని అభినందించాల్సిందేనని వ్యాఖ్యానిస్తూ.. సెర్చ్‌ వారంట్లు జారీ చేసే అధికారం పోలీసులకు ఉందా లేదా అన్న అంశంపై ఆధారాలతో సహా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 
 
Telangana High Court
Telangana police
Police search warrants
Justice Aparesh Kumar Singh
Justice Mohiuddin
CrPC Section 93
Hyderabad City Police Act Section 47
Cordon and search

More Telugu News