Kim Jong Un: బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా.. జపాన్‌, దక్షిణ కొరియాలో హై అలెర్ట్

North Korea Ballistic Missile Launch Triggers Alert in Japan South Korea
  • తూర్పు ఆసియాలో మళ్లీ క్షిపణి కలకలం
  • జపాన్‌కు ఉత్తర కొరియా వార్నింగ్!
  • ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి సముద్రంలోకి దూసుకెళ్లిన పలు క్షిపణులు
కొన్ని రోజుల విరామం తర్వాత ఉత్తర కొరియా తన క్షిపణి ప్రయోగాలతో తూర్పు ఆసియాలో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆదివారం ఉదయం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు గుర్తించిన జపాన్ ప్రభుత్వం తన దేశ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. సుమారు రెండు నెలల తర్వాత ఉత్తర కొరియా జరిపిన మొదటి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష ఇదే కావడం గమనార్హం.

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేసినట్లు జపాన్ ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది. జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ క్షిపణి అప్పటికే సముద్రంలో పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు, ఆదివారం ఉదయం 7:50 గంటల ప్రాంతంలో రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని తీరం నుంచి ఉత్తర కొరియా వరుసగా పలు క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. అమెరికా, జపాన్ దేశాలతో కలిసి పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని సియోల్ వెల్లడించింది.

దక్షిణ కొరియా అధ్యక్షుడు 'లీ జే మ్యుంగ్' చైనా పర్యటనకు బయలుదేరుతున్న తరుణంలో ఈ ప్రయోగాలు జరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనేలా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సానుకూలంగా స్పందిస్తారని దక్షిణ కొరియా ఆశిస్తున్న వేళ.. కిమ్ జోంగ్ ఉన్ క్షిపణులతో కవ్వింపులకు దిగారు.

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ శనివారమే ఒక భారీ ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారు. క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవలే అణుశక్తితో నడిచే జలాంతర్గామిని కూడా ఆయన పరిశీలించారు. రానున్న 'నైన్త్ పార్టీ కాంగ్రెస్' సమావేశాల లోపు తన సైనిక బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతోనే కిమ్ ఇలాంటి ప్రయోగాలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో జపాన్, దక్షిణ కొరియాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.
Kim Jong Un
North Korea
ballistic missile
Japan
South Korea
missile test
Pyongyang
military
China
Lee Jae-myung

More Telugu News