Ro Khanna: ‘పుతిన్ రేపు జెలెన్‌స్కీని బంధిస్తే ఏం చేస్తారు?’.. ట్రంప్ సైనిక చర్యపై రో ఖన్నా విసుర్లు!

Ro Khanna Slams Trump Over Venezuela Attack Putin Zelensky Scenario
  • వెనిజులా అధ్యక్షుడిని బంధించడంపై  భారత సంతతి ఎంపీ ఆగ్రహం
  • ప్రపంచ దేశాలకు అమెరికా ఎలాంటి సంకేతాలు ఇస్తోందని నిలదీత
  • కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధానికి దిగడం అప్రజాస్వామికమని ఎంపీల ఆగ్రహం
  • వెనిజులా పరిణామాలను మరో ఇరాక్ యుద్ధంతో పోల్చిన అమెరికా ప్రజాప్రతినిధులు
వెనిజులాపై అమెరికా జరిపిన సైనిక చర్యను భారత సంతతికి చెందిన యూఎస్ ఎంపీ రో ఖన్నా తీవ్రంగా తప్పుబట్టారు. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర ధోరణులకు దారితీస్తుందని హెచ్చరించారు. "ఒక దేశాధ్యక్షుడిని బంధించడాన్ని అమెరికా సమర్థించుకుంటే.. రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని బంధించినా, లేదా చైనా.. తైవాన్‌పై దాడి చేసినా మనం ఏ ముఖం పెట్టుకుని ప్రశ్నిస్తాం?" అని రో ఖన్నా సోషల్ మీడియా వేదికగా నిలదీశారు.

డొనాల్డ్ ట్రంప్ తన 'మాగా' (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) మద్దతుదారులను వంచించారని రో ఖన్నా ఆరోపించారు. విదేశీ యుద్ధాలకు స్వస్తి పలికి దేశీయ సమస్యలపై దృష్టి పెడతానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు వెనిజులాలో అనవసరమైన యుద్ధాన్ని మొదలుపెట్టారని విమర్శించారు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, లిబియా వంటి దేశాల్లో అమెరికా చేసిన పాత తప్పులనే ఇప్పుడు వెనిజులాలో పునరావృతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రో ఖన్నా మాత్రమే కాదు.. సెత్ మౌల్టన్, రషీదా త్లైబ్, ఆండీ కిమ్ వంటి పలువురు డెమోక్రటిక్ నేతలు కూడా ట్రంప్ చర్యను 'చట్టవిరుద్ధం' అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) అనుమతి లేకుండా ఒక సార్వభౌమ దేశంపై దాడి చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని స్పష్టం చేశారు. వెనిజులా నుంచి అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేకపోయినా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ 'రెగ్యుమ్ చేంజ్' (అధికార మార్పిడి) యుద్ధాన్ని తెచ్చిపెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు.

విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ గతంలో పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని సెనేటర్ ఆండీ కిమ్ విమర్శించారు. వెనిజులాలో అధికార మార్పిడి చేసే ఉద్దేశం తమకు లేదని నమ్మించి, ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరించడం ద్వారా ప్రజలను, ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టించారని వారు మండిపడుతున్నారు. ప్రస్తుతం వెనిజులాలో నెలకొన్న అనిశ్చితికి ట్రంప్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
Ro Khanna
Venezuela
Donald Trump
Russia
Ukraine
Putin
Zelensky
US Foreign Policy
Regime Change
US Congress

More Telugu News