Anil Kumar Singhal: అనుబంధ ఆలయాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి.. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

TTD to Appoint Special Officers for Monitoring Affiliated Temples Development
  • టీటీడీ అనుబంధ ఆలయాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం
  • ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వినియోగం
  • సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని టీటీడీ ఆలయాల్లో అన్నదానం అమలు
  • అనుబంధ ఆలయాల కోసం ఎస్వీబీసీలో మరో ఛానల్ ఏర్పాటుపై పరిశీలన
టీటీడీకి అనుబంధంగా ఉన్న స్థానిక ఆలయాల అభివృద్ధి, నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, వాటి కార్యకలాపాలను సమర్థంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రత్యేక అధికారులు తరచూ ఆలయాలను సందర్శించి, అభివృద్ధి పనులపై నివేదికలు రూపొందించాలని, భక్తుల సౌకర్యాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో అన్నదానం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి ఆలయానికి ఒక జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో ప్రత్యేక అకౌంట్ ఏర్పాటు చేసి, వాటిని పర్యవేక్షించాలని సూచించారు.

ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యాన్ని భక్తులకు మరింత చేరువ చేసేందుకు వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీని వినియోగించుకోవాలని సింఘాల్ సూచించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ యాప్ ద్వారా ఆలయంలోని శిల్పాలను సెల్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే, వాటి పౌరాణిక, చారిత్రక నేపథ్యం తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

తిరుమల శ్రీవారి కైంకర్యాల తరహాలోనే, అనుబంధ ఆలయాల విశిష్టతను కూడా భక్తులకు తెలియజేసేందుకు ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో కొత్త ఛానల్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను కోరారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సీసీటీవీల ఏర్పాటు, భద్రత, రవాణా వంటి అంశాలపై సీవీఎస్‌వోతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఆలయాల్లో కైంకర్యాలు, ఉత్సవాలను సకాలంలో నిర్వహించాలని, శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని, పుష్కరిణులను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సీఏవో శ్రీ ఓ బాలాజీ, సీఈ శ్రీ టి.వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తిరుమల సమాచారం (03.01.2026, శనివారం)
  • శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 88,662
  • తలనీలాలు సమర్పించుకున్న వారు: 24,417
  • శ్రీవారి హుండీ ఆదాయం: ₹5.05 కోట్లు
  • దర్శన క్యూల పరిస్థితి: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపల శిలాతోరణం వరకు విస్తరించాయి.
  • సర్వదర్శనానికి పట్టే సమయం: టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
Anil Kumar Singhal
TTD
Tirumala Tirupati Devasthanam
Andhra Pradesh Temples
Temple Management
Virtual Reality
Augmented Reality
SVBC Channel
Nara Chandrababu Naidu
Annam Danam

More Telugu News