Satya Kumar Yadav: 108 సర్వీసులపై వైసీపీ ప్రచారం... ఆధారాలతో తిప్పికొట్టిన కూటమి ప్రభుత్వం

Satya Kumar Yadav refutes YSRCP claims on 108 ambulance services
  • 108 అంబులెన్సులపై వైసీపీది తప్పుడు ప్రచారమని ప్రభుత్వం వెల్లడి
  • రణస్థలం ఘటనలో 7 నిమిషాల్లోనే అంబులెన్స్ చేరిందన్న మంత్రి సత్యకుమార్
  • గత ప్రభుత్వ హయాంలోనే 300 అంబులెన్సులు మూలనపడ్డాయని ఆరోపణ
  • కడప, ఏలూరులో వాస్తవాలను మీడియాకు చూపిన కూటమి ఎమ్మెల్యేలు
  • కొత్త అంబులెన్సులను చూపిస్తూ వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టిన నేతలు
రాష్ట్రంలో 108 అంబులెన్సుల సేవలకు సంబంధించి ప్రతిపక్ష వైసీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా చేస్తున్న ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం ఘటనను ఉదాహరణగా చూపిస్తూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఆధారాలతో సహా వాస్తవాలను ప్రజల ముందు ఉంచింది.

ఈ ఆరోపణలపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రణస్థలం ఘటనలో ఉదయం 08:05 గంటలకు కాల్ వస్తే.. 08:07 నిమిషాలకు అంబులెన్సుకు విషయం తెలియచేశారని... వెంటనే బయలుదేరిన అంబులెన్స్ ఘటనా స్థలానికి  08:14 చేరుకుందని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 23 నిమిషాల్లోపు చేరుకోవాల్సి ఉండగా, అంతకంటే చాలా వేగంగా అంబులెన్స్ స్పందించిందని వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే, అంబులెన్స్ ఆలస్యమైందని వైసీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా అభూత కల్పనలతో దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే 108 వ్యవస్థ నిర్వీర్యం అయిందని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్లే సుమారు 300 అంబులెన్సులు రోడ్లపైన, ఆసుపత్రుల్లో శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. తమకు చెందిన అరబిందో కంపెనీకి ఏడేళ్ల పాటు 104, 108 టెండర్లను కట్టబెట్టి, అసలైన తయారీ సంస్థతో నిర్వహణ ఒప్పందాన్ని రద్దు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

మరోవైపు, కూటమి ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రజల ముందుంచారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, రిమ్స్ ఆసుప‌త్రి ప్రాంగణంలో గత ప్రభుత్వ హయాంలో మూలనపడిన అంబులెన్సులను మీడియాకు చూపించారు. కొత్త ప్రభుత్వం కడపకు 6 కొత్త అంబులెన్సులను కేటాయించిందని తెలిపారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ కూడా జిల్లా ఆసుప‌త్రిలో కొత్తగా వచ్చిన 6 అత్యాధునిక అంబులెన్సులను చూపిస్తూ, వైసీపీకి విమర్శించేందుకు ఏ అంశం లేక తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. మొత్తం మీద, వైసీపీ ఆరోపణలను కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఆధారాలతో తిప్పికొడుతున్నారు.
Satya Kumar Yadav
Andhra Pradesh
108 ambulance service
YSRCP
TDP
Arobindo company
Kadapa
Eluru
Medical Services
AP Politics

More Telugu News