జగన్ కష్టాన్ని తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారు: గుడివాడ అమర్నాథ్
- భోగాపురం విమానాశ్రయం ఘనత జగన్ దేనన్న అమర్నాథ్
- ఉత్తరాంధ్ర ప్రజల కలను నిజం చేసిన నాయకుడు జగన్ అని కితాబు
- ఇప్పుడు తొలి ఫ్లైట్ ల్యాండింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయని వ్యాఖ్య
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ఘనత పూర్తిగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ దేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలను నిజం చేసిన నాయకుడు జగన్ అని కొనియాడారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం అవసరమైన భూ సమీకరణ, భూ వివాదాల పరిష్కారం అన్నీ జగన్ హయాంలోనే జరిగాయని అమర్నాథ్ గుర్తుచేశారు. భూములు ఇచ్చిన రైతులు, బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో దాదాపు రూ.1,100 కోట్ల భారీ పరిహారాన్ని జగన్ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇది గత ప్రభుత్వాలు చేయలేని పని అని వ్యాఖ్యానించారు.
2023 మే 3వ తేదీన భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు జగన్ శంకుస్థాపన చేశారని, 2025 డిసెంబర్ నాటికి తొలి విమానం ల్యాండ్ అయ్యేలా జీఎంఆర్ సంస్థకు స్పష్టమైన టార్గెట్ ఇచ్చారని తెలిపారు. అదే ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు తొలి ఫ్లైట్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
అయితే ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకు 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు హడావిడిగా శంకుస్థాపన చేశారని అమర్నాథ్ ఆరోపించారు. మొత్తం 2,700 ఎకరాలు అవసరమైతే, చంద్రబాబు హయాంలో 250 ఎకరాలు కూడా సేకరించలేదని తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ చేసిన కష్టాన్ని, ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాన్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని అమర్నాథ్ మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని, దీనికి అసలు శిల్పి జగనేనని చెప్పారు.