Bhumana Karunakar Reddy: గోవిందరాజస్వామి ఆలయంపైకి ఎక్కిన మందుబాబు... భూమన తీవ్ర వ్యాఖ్యలు
- ఆలయంపైకి మందుబాబు ఎక్కడం చాలా దుణమన్న భూమన
- కూటమి ప్రభుత్వంలో టీటీడీ ప్రతిష్ట మంటగలుస్తోందని వ్యాఖ్య
- టీటీడీ ఛైర్మన్ వీఐపీల సేవలో మునిగిపోయారని విమర్శ
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన ఘటన టీటీడీ భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆలయ రాజగోపురంపైకి మద్యం సేవించిన ఒక వ్యక్తి ఎక్కి... “మందు ఇవ్వకపోతే కిందకు దిగను” అంటూ హల్‌చల్ చేయడం భక్తులను కలవరపెట్టింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి సంఘటన జరగడం భద్రత ఎంత డొల్లగా ఉందో స్పష్టంగా చూపిస్తోందని ఆయన మండిపడ్డారు.
గోవింద రాజస్వామి ఆలయంలో జరిగినది అత్యంత దారుణమని వ్యాఖ్యానించిన భూమన... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ప్రతిష్ఠ పూర్తిగా మంటగలుస్తోందని ఆరోపించారు. ఎంత సేపు గొప్పలు చెప్పుకోవడమే తప్ప, ఆలయ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేసింది ఏమీలేదని విమర్శించారు.
ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వీఐపీ సేవల్లో మునిగి, ఆలయ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని భూమన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తిరుమల కొండపై మద్యం, మాంసం సులభంగా దొరుకుతోందని, ఇది పవిత్రతకు భంగం కలిగించే విషయమని అన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఇచ్చిన దర్శన చిట్టా ఎందుకు తక్కువగా ఉందని ప్రశ్నించారు. దర్శనాల చిట్టాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
భక్తుల గోడును పట్టించుకోవడం మానేశారని, తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నమే కనిపించడం లేదని భూమన అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంవో నుంచి వచ్చే సిఫార్సు లేఖలకే దర్శనాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.