Pawan Kalyan: తెలంగాణ నేల నాకు పోరాడే ధైర్యాన్ని ఇచ్చింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan Inspired by Telangana People to Fight
  • పోరాట పటిమ, చైతన్యం, తెగింపు తెలంగాణ నుంచే వచ్చాయన్న పవన్ కల్యాణ్
  • రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న పవన్ కల్యాణ్
  • పోటీ చేయడం అలవాటు చేసుకోవాలని జనసైనికులకు సూచన
తెలంగాణ నేల తనకు పోరాడే ధైర్యాన్ని ప్రసాదించిందని, ఈ ప్రాంత ప్రజల స్ఫూర్తే తనను ముందుకు నడిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అనంతరం జగిత్యాల జిల్లాలో నిర్వహించిన జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన రాజకీయ జీవితంలో పోరాట పటిమ, చైతన్యం, తెగింపు అన్నీ తెలంగాణ నుంచే వచ్చాయని ఆయన అన్నారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పోటీ చేయడం మాత్రం అలవాటు చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఓటమికి భయపడకుండా పోటీ చేసే మనస్తత్వం జనసేనలో పెరగాలని సూచించారు. పోటీ పడినప్పుడే అనుభవం వస్తుందని, ప్రజల మధ్య ఉండగలమని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరూ శత్రువులు కాదని ఆయన స్పష్టం చేశారు. తమ పోరాటం వ్యక్తులపై కాదని, విధానాలపైనే అని అన్నారు.

ప్రజా ప్రయోజనాల కోసం, సరైన విధానాల కోసం మాత్రమే జనసేన రాజకీయాల్లో పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసైనికులు ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి జన సైనికుడిపై ఉందని అన్నారు. వంద మైళ్ల దూరం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

జనసేన ప్రయాణం ఇప్పుడు బలంగా మొదలైందని, ముందున్న లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తల సమావేశంలో ఆయన సూచించారు. అంజన్న సన్నిధి తనను కాపాడిందని పవన్ కల్యాణ్ అన్నారు. కష్టకాలంలో ఆధ్యాత్మిక బలం తనకు అండగా నిలిచిందని ఆయన అన్నారు.
Pawan Kalyan
Telangana
Janasena
Andhra Pradesh Deputy CM
Kondagattu Anjanna Temple
Jagitial

More Telugu News