Anil Ravipudi: హీరోగా మారతారా అనే ప్రశ్నకు అనిల్ రావిపూడి ఆసక్తికర సమాధానం
- హీరోగా మారే ఆలోచన లేదన్న అనిల్ రావిపూడి
- ట్రాప్‌లకు లొంగితే ఇప్పటికే ఉన్న కెరీర్‌కే ప్రమాదం ఏర్పడుతుందని వ్యాఖ్య
- తన పూర్తి దృష్టి దర్శకత్వంపైనే అని వెల్లడి
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో కావాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చి, కాలక్రమంలో దర్శకులుగా స్థిరపడిన వాళ్లు ఉన్నారు. అలాగే దర్శకత్వ విభాగంలోకి అడుగుపెట్టి, తర్వాత హీరోలుగా మారి సక్సెస్ అందుకున్న ఉదాహరణలూ ఉన్నాయి. నాని, రాజ్ తరుణ్ లాంటి వారు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి, హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇదే సమయంలో, కొందరు సక్సెస్‌ఫుల్ దర్శకులు హీరోగా మారాలని ప్రయత్నించి ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి హీరోగా మారతారా? అన్న చర్చ ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది.
స్టేజ్‌పై ఆయన మాట్లాడే తీరు, టైమింగ్, కామెడీ సెన్స్ చూసి “హీరో మెటీరియల్” అంటూ అభిమానులు కామెంట్లు చేయడం కొత్త కాదు. అయితే ఈ అంశంపై అనిల్ రావిపూడి ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హీరోగా సినిమా చేయొచ్చుకదా అని ప్రశ్నించగా... ఆయన ఆసక్తికరంగా స్పందించారు.
ఒక వ్యక్తి తన క్రాఫ్ట్‌లో టాప్‌లో ఉన్నప్పుడు, దారి మళ్లించే ప్రలోభాలు వస్తాయని చెప్పారు. అలాంటి ట్రాప్‌లకు లొంగితే ఇప్పటికే ఉన్న కెరీర్‌కే ప్రమాదం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. అందుకే తనకు హీరోగా మారాలనే ఆలోచన ఏమాత్రం లేదని, పూర్తిగా దర్శకత్వంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
టాలీవుడ్‌లో దర్శకుడు రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ లేని ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్‌గా అనిల్ రావిపూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ రికార్డును కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని, నటన వైపు వెళ్లి ఫోకస్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి పూర్తిగా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపైనే దృష్టి పెట్టారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు. భారీ తారాగణం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంశాలతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి సెంటిమెంట్‌లా మారింది. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో ఆ సీజన్‌లో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు అదే నమ్మకంతో ‘మన శంకర వరప్రసాద్ గారు’తో మరోసారి సంక్రాంతి సక్సెస్ రిపీట్ అవుతుందనే విశ్వాసంతో ఆయన ఉన్నారు.