Donald Trump: వెనెజులా అధ్యక్షుడ్ని, ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump Announces Capture of Venezuelan President Maduro
  • వెనెజులాపై అమెరికా భారీ సైనిక దాడి!
  • అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను దేశం బయటికి తరలించామని ట్రంప్ వెల్లడి
  • రాజధాని కారకాస్‌లో వరుస పేలుళ్లతో ప్రజల భయాందోళన
  • ఇది అమెరికా దురాక్రమణేనని వెనెజులా ప్రభుత్వం ఆరోపణ
  • దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మదురో సర్కార్
అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ వెనెజులాపై అమెరికా భారీ సైనిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి, దేశం బయటకు తరలించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శనివారం తెల్లవారుజామున వెనిజువెలా రాజధాని కారకాస్‌లో భారీ పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి.

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "అమెరికా సంయుక్త రాష్ట్రాలు వెనెజులాపై, ఆ దేశ నేత నికోలస్ మదురోపై విజయవంతంగా భారీ సైనిక చర్యను చేపట్టాయి. మదురోను, ఆయన భార్యను బంధించి, దేశం వెలుపలకు తరలించాం" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అమెరికా చట్ట సంస్థల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించామని, మరిన్ని వివరాలను ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో ఉదయం 11 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) జరిగే మీడియా సమావేశంలో వెల్లడిస్తామని తెలిపారు. అమెరికా సైన్యంలోని అత్యంత కీలకమైన 'డెల్టా ఫోర్స్' ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు అమెరికన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు, ఈ దాడిని వెనిజువెలా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది అమెరికా పాల్పడిన అత్యంత తీవ్రమైన సైనిక దురాక్రమణ అని మండిపడింది. తమ దేశంలోని చమురు, ఖనిజ సంపద వంటి వ్యూహాత్మక వనరులను స్వాధీనం చేసుకోవడానికే అమెరికా ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపించింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కారకాస్‌లో కనీసం ఏడు భారీ పేలుళ్లు సంభవించాయని, ఆకాశంలో యుద్ధ విమానాల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కారకాస్‌లోని లా కార్లోటా సైనిక విమానాశ్రయం, ఫోర్ట్ టియునా సైనిక స్థావరం సమీపంలో దట్టమైన పొగలు కమ్ముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భారీ పేలుళ్ల నేపథ్యంలో అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పేలుళ్ల కారణంగా కారకాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

కొలంబియాలోని అమెరికా రాయబార కార్యాలయం (వెనిజువెలా వ్యవహారాలను కూడా ఇదే కార్యాలయం పర్యవేక్షిస్తుంది) వెనెజులాకు ప్రయాణాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత ప్రమాదకరమైన 'లెవెల్ 4' ట్రావెల్ అడ్వైజరీని పునరుద్ఘాటించింది. వెనెజులాలో ఉన్న అమెరికా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది. 2019 మార్చిలోనే కారకాస్‌లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసినందున, అక్కడ తమ పౌరులకు ఎలాంటి అత్యవసర సేవలు అందించలేమని స్పష్టం చేసింది. ట్రంప్ నిర్వహించబోయే మీడియా సమావేశం తర్వాత ఈ ఘటనపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Donald Trump
Venezuela
Nicolas Maduro
US Military Action
Caracas
Truth Social
Delta Force
US Embassy Colombia
Venezuela Crisis

More Telugu News