Narayana: అమరావతిలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జీల నివాస భవనాల నిర్మాణాలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
- అమరావతిలో 4,026 భవనాలు, ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయన్న నారాయణ
- ఏప్రిల్ నాటికి పూర్తి చేసి హ్యాండోవర్ చేస్తామన్న మంత్రి
- వర్షాల కారణంగా కొన్ని పనులు ఆలస్యమయ్యాయని వెల్లడి
ఏపీ రాజధాని అమరావతిలో రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జీల కోసం నిర్మిస్తున్న నివాస భవనాల పనులు ఈ ఏప్రిల్‌లో పూర్తి చేసి హ్యాండోవర్ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో మొత్తం 4,026 భవనాలు, ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. వీటిలో 186 బంగ్లాలు, మిగతా 3,840 భవనాలు అపార్ట్‌మెంట్ మోడల్లో రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఈ ఏడాది అమరావతిలో ఎక్కువ వర్షాల కారణంగా కొన్ని పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం అన్ని నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మంత్రుల బంగ్లాలు ఎక్కువ భాగం ఇప్పటికే పూర్తయినట్లు, జడ్జీల బంగ్లాల్లో బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ తుది దశకు చేరిందని, అలాగే అఖిల భారత సర్వీసు అధికారుల టవర్స్ కూడా తుది దశలో ఉన్నాయని తెలిపారు.
500 నివాస సముదాయాలను మినహా మిగతా భవనాలను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని నారాయణ చెప్పారు. అన్ని భవనాలు పూర్తయిన తర్వాత, జీఏడీ (General Administration Department)కి హ్యాండ్ ఓవర్ చేస్తామని, వారు కేటాయింపు ప్రక్రియను చేపడతారని వెల్లడించారు. అలాగే, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ జనవరి 7న జారీ చేస్తామని, ఇంకా 4.5 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని తెలిపారు. ఇందులో 2 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, రాష్ట్ర మంత్రులు, అధికారులు, జడ్జీలు కోసం ఆధునిక, సౌకర్యవంతమైన నివాస వసతులు అమరావతిలో అందుబాటులోకి వస్తాయి.