Mustafizur Rahman: కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజూర్ రెహ్మాన్ తొలగింపు

Mustafizur Rahman Dropped from Kolkata Knight Riders Ahead of IPL 2026
  • బీసీసీఐ ఆదేశాలతో పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేసిన కేకేఆర్
  • బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో చెలరేగిన వివాదమే కారణం
  • మినీ వేలంలో రికార్డు స్థాయిలో రూ.9.20 కోట్లకు ముస్తాఫిజుర్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్
  • కేకేఆర్ జట్టులో మరో ఆటగాడిని భర్తీ చేసుకునేందుకు బీసీసీఐ అనుమతి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు కేకేఆర్ శనివారం అధికారికంగా ప్రకటించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.

ఈ విషయంపై కేకేఆర్ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఐపీఎల్ నియంత్రణ సంస్థ అయిన బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేశాం. నిబంధనల ప్రకారం అతని స్థానంలో మరో ఆటగాడిని భర్తీ చేసుకునేందుకు బీసీసీఐ అనుమతించింది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తాం" అని కేకేఆర్ తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా కూడా ధ్రువీకరించారు.

ఇటీవలి పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపినప్పటికీ, దీని వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. గత డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీ వర్గాలపై జరిగిన దాడుల నేపథ్యంలో తీవ్ర వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రికార్డు స్థాయిలో రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడి కోసం చెన్నై, ఢిల్లీ ఫ్రాంచైజీలతో కేకేఆర్ తీవ్రంగా పోటీపడి దక్కించుకుంది. 2016లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన ముస్తాఫిజుర్, ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు ఆడి 65 వికెట్లు పడగొట్టాడు.


Mustafizur Rahman
Kolkata Knight Riders
KKR
IPL 2026
Bangladesh
BCCI
Indian Premier League
Cricket
Devarjit Saikia

More Telugu News