హోటల్‌లో హాలీవుడ్ నటుడు టామీ లీ జోన్స్ కుమార్తె విక్టోరియా అనుమానాస్పద మృతి

  • శాన్‌ఫ్రాన్సిస్కోలోని లగ్జరీ హోటల్‌ 14వ అంతస్తులో విక్టోరియా జోన్స్ మృతదేహం గుర్తింపు
  • ఘటనా స్థలంలో లభించని డ్రగ్స్, ఆత్మహత్యకు సంబంధించిన ఆధారాలు 
  • గతేడాది కాలంలో మూడుసార్లు పలు కేసుల్లో అరెస్టయిన విక్టోరియా
  • 'మెన్ ఇన్ బ్లాక్ 2' వంటి చిత్రాల్లో తండ్రితో కలిసి నటించిన విక్టోరియా
హాలీవుడ్ ప్రముఖ నటుడు, ఆస్కార్ విజేత టామీ లీ జోన్స్ కుమార్తె విక్టోరియా జోన్స్ శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఒక హోటల్‌లో మరణించారు. నగరం సమీపంలోని నోబ్ హిల్ ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన ఫెయిర్‌మాంట్ హోటల్ 14వ అంతస్తులో గురువారం తెల్లవారుజామున ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని ఒక అతిథి గమనించారు. హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి ఆమెకు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న పారామెడికల్ సిబ్బంది ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు.

ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ మరణంలో ఎలాంటి కుట్ర లేదని శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో డ్రగ్స్ వాడినట్లు లేదా ఆత్మహత్య చేసుకున్నట్లు ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. అయితే, ఆమె ఆ హోటల్‌లో గెస్ట్‌గా ఉన్నారా? అసలు 14వ అంతస్తుకు ఎలా చేరుకున్నారు? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె మరణానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి మెడికల్ ఎగ్జామినర్ విచారణ జరుపుతున్నారు.

విక్టోరియా జోన్స్ గతంలో తన తండ్రితో కలిసి 'మెన్ ఇన్ బ్లాక్ II', 'వన్ ట్రీ హిల్' వంటి చిత్రాల్లో నటించారు. అయితే, కొంతకాలంగా ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు. గడిచిన ఏడాది కాలంలోనే మాదక ద్రవ్యాల వినియోగం, అధికారులను అడ్డుకోవడం, గృహ హింస వంటి ఆరోపణలపై మూడుసార్లు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. టామీ లీ జోన్స్ మొదటి భార్య కింబర్లీ క్లౌలీకి విక్టోరియా జన్మించారు.  


More Telugu News