బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి.. స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు

  • హిందువు సజీవ దహనం దారుణమన్న ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు
  • అక్కడ జరిగిన హత్య దక్షిణాసియాను సిగ్గుపడేలా చేసిందని ఘాటు వ్యాఖ్య
  • బంగ్లాదేశ్‌లో జరిగిన హత్యను సాధారణ ఘటనగా కొట్టి పారేయలేమన్న కాంగ్రెస్ నాయకురాలు
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలపల్లి రేఖ తీవ్రంగా స్పందించారు. వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, అక్కడ ఓ హిందువును సజీవ దహనం చేయడం దారుణమని అన్నారు. విద్వేష రాజకీయాల దుష్పరిణామం కారణంగా హత్య జరిగిందని, ఇది దక్షిణాసియాను సిగ్గుపడేలా చేసిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

బంగ్లాదేశ్‌లో గత డిసెంబర్ నెలలో మైమెన్‌సింగ్ జిల్లాలోని ఒక ఫ్యాక్టరీలో దీపూ చంద్ర దాస్‌పై మూక దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత కళిమొహర్ యూనియన్‌లోని హొసైన్‌డంగా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మండల్‌‌పై దాడి చేసి హతమార్చారు. రెండు రోజుల క్రితం షరియత్‌పూర్ జిల్లాలో 50 ఏళ్ల ఖోకోన్ దాస్‌పై దాడి చేసి, అనంతరం నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలపై బోయలపల్లి రేఖ స్పందించారు.

అక్కడి హిందువులు మమ్మల్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించడం బంగ్లాదేశ్‌లో క్షీణించిన మానవతా విలువలకు అద్దం పడుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన హత్యను ఒక సాధారణ ఘటనగా కొట్టిపారేయలేమని అన్నారు. దక్షిణాసియాలో పెరుగుతున్న మతాధిపత్యం, మెజారిటీ రాజకీయాల ఫలితంగానే ఈ హత్య జరిగిందని చూడాలని అన్నారు.

మన దేశంలోనూ ఆరెస్సెస్ సిద్ధాంతాల ఆధారంగా సాగుతున్న మోదీ పాలన విద్వేషాన్ని సాధారణ రాజకీయ ఆయుధంగా మార్చుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో మైనారిటీలపై దాడులకు పురిగొల్పే వాతావరణమే, పొరుగు దేశాల్లో మైనారిటీలైన హిందువులపై దాడులకు ప్రేరణంగా మారుతోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వాలైనా విద్వేషాలను ప్రోత్సహించడం మానుకోవాలని సూచించారు.

మతాధిపత్య రాజకీయాల వల్ల మైనారిటీల భద్రత పట్ల ఆందోళనలు కలుగుతున్నాయని ఆమె అన్నారు. మన దేశంలో, విదేశాల్లోనూ మహిళలు, కుటుంబాలు, మతపరమైన అల్ప సంఖ్యాకులు భద్రంగా జీవించే హక్కును కలిగి ఉండటమే నిజమైన దేశభక్తి అవుతుందని అన్నారు. విశ్వగురు నినాదాల మధ్య లౌకికత్వం, నైతిక నాయకత్వం క్షీణిస్తే బంగ్లాదేశ్‌లో దీపూ చంద్రదాస్ మాదిరి విషాదాలు చూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News