వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- తనకు వారాంతపు సెలవులు ఉండవన్న జైశంకర్
- సంగీతం, పుస్తకాలు తనకు ప్రశాంతతను ఇస్తాయని వ్యాఖ్య
- డిటాక్స్ కావాల్సిన అవసరం తనకు లేదన్న జైశంకర్
వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ అనే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత ఎలా సాధించాలన్న ప్రశ్నపై పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తాజాగా వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపైనే మాట్లాడే జైశంకర్ ఈసారి తన వ్యక్తిగత జీవన విధానం గురించి ఓపెన్‌గా చెప్పడం విశేషంగా మారింది.
ఐఐటీ మద్రాస్ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్... తనకు మిగతా ఉద్యోగుల్లా వారాంతపు సెలవులు ఉండవని స్పష్టం చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు షెడ్యూల్ వేసుకుని పనిచేయడం తన వృత్తిలో సాధ్యం కాదన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలకు టైమ్ టేబుల్ ఉండదని, ప్రపంచంలోని దేశాలు వేర్వేరు టైమ్ జోన్లలో ఉండటంతో ఎప్పుడైనా పని చేయాల్సి వస్తుందని వివరించారు.
తన రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్లను పాటిస్తూ మానసిక ప్రశాంతతను పొందుతున్నానన్నారు. విశ్రాంతి కోసం సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, క్రీడల్లో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడం వంటి అలవాట్లు తనకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఈ అలవాట్ల వల్ల ప్రపంచంతో అనుసంధానమై ఉండగలుగుతున్నానని, అదే తనకు వర్క్ - లైఫ్ బ్యాలెన్స్‌ను ఇస్తోందని తెలిపారు.
ప్రత్యేకంగా బ్రేక్ తీసుకోవడం లేదా డిటాక్స్ కావాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్న జైశంకర్... ఈ విధానంతో తన జీవితం సహజంగానే కొనసాగుతోందన్నారు. అయితే ఈ అభిప్రాయాలు ఇంట్లో అందరికీ నచ్చవని నవ్వుతూ చెప్పారు. తన భార్య కూడా ఇక్కడే ఉన్నారని, ఈ విషయంపై ఆమె తనతో విభేదించే అవకాశం ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు విద్యార్థులతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చకు దారి తీశాయి.