Deepinder Goyal: మా సిస్టమ్ బాగోలేకపోతే ఇంతమంది ఎందుకు పనిచేస్తారు? - జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్

Deepinder Goyal on Zomato Gig Workers Strike
  • గిగ్ వర్కర్ల సమ్మెను కొట్టిపారేసిన జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్
  • నిరసనకారులు కొద్దిమంది దుండగులంటూ వివాదాస్పద వ్యాఖ్య
  • న్యూ ఇయర్ ఈవ్‌నాడు రికార్డు స్థాయిలో 75 లక్షల ఆర్డర్లు డెలివరీ చేశామన్న కంపెనీ
  • జొమాటో ప్రకటన పూర్తిగా అబద్ధమంటున్న వర్కర్ యూనియన్లు
  • డబ్బు, పోలీసుల బలంతో సమ్మెను అణచివేశారని ఆరోపణ
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెపై ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు. సమ్మెలో పాల్గొన్న వారిని "కొద్దిమంది దుండగులు" (miscreants) అని అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్మె ప్రభావం తమ కార్యకలాపాలపై ఏమాత్రం పడలేదని, పైగా న్యూ ఇయర్ ఈవ్ రోజున జొమాటో, బ్లింకిట్ ప్లాట్‌ఫామ్‌లపై ఆల్-టైమ్ రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

జనవరి 1న సోషల్ మీడియా వేదికగా దీపిందర్ గోయల్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఒక వ్యవస్థ ప్రాథమికంగా బాగోలేకపోతే, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు స్థిరంగా అందులో పనిచేయడానికి ముందుకు రారు. కొందరు స్వార్థ ప్రయోజనాలతో చేసే ప్రచారాలను నమ్మవద్దు" అని ఆయన వ్యాఖ్యానించారు. న్యూ ఇయర్ ఈవ్ రోజున 4.5 లక్షల మందికి పైగా డెలివరీ భాగస్వాములు 63 లక్షల మంది కస్టమర్లకు 75 లక్షలకు పైగా ఆర్డర్లను విజయవంతంగా అందించారని తెలిపారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపులో ఉంచడంలో సహకరించిన స్థానిక పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బెదిరింపులు ఉన్నప్పటికీ పనికి హాజరై నిజాయతీగా పనిచేసిన డెలివరీ భాగస్వాములను ఆయన అభినందించారు.

అయితే, దీపిందర్ గోయల్ ప్రకటనను గిగ్ వర్కర్ల యూనియన్లు తీవ్రంగా ఖండించాయి. జొమాటో వాదనలు పూర్తిగా అబద్ధమని, తమ సమ్మె విజయవంతమైందని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) వంటి సంఘాలు పేర్కొన్నాయి. డబ్బు, అధికార బలాన్ని ఉపయోగించి, పోలీసుల సాయంతో కంపెనీలు సమ్మెను నీరుగార్చడానికి ప్రయత్నించాయని ఆరోపించాయి. దేశవ్యాప్తంగా 22 నగరాల్లో లక్ష మందికి పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారని యూనియన్లు తెలిపాయి.

మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, సురక్షితమైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గిగ్ వర్కర్లు డిసెంబర్ 31న సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 10 నిమిషాల డెలివరీ విధానాన్ని రద్దు చేయాలని, ఏకపక్షంగా ఐడీలను బ్లాక్ చేయడాన్ని ఆపాలని వారు కోరుతున్నారు. ఒకవైపు గిగ్ ఎకానమీ దేశంలో అతిపెద్ద ఉపాధి మార్గమని కంపెనీ చెబుతుండగా, మరోవైపు తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని వర్కర్ యూనియన్లు స్పష్టం చేస్తున్నాయి.
Deepinder Goyal
Zomato
gig workers strike
food delivery
New Year's Eve
TGPWU
delivery partners
gig economy
worker unions
Blinkit

More Telugu News