Sherfane Rutherford: 6 బంతుల్లో ఆరు సిక్సర్లు.. రూథర్‌ఫోర్డ్, బ్రెవిస్ ఊచకోత.. వీడియో ఇదిగో!

Sherfane Rutherford Dewald Brevis Smash Six Sixes in SA20 League
  • వరుసగా 6 సిక్సర్లు బాదిన డెవాల్డ్ బ్రెవిస్, రూథర్‌ఫోర్డ్  
  • బౌలింగ్‌లోనూ మెరిసిన రూథర్‌ఫర్డ్ 
  • ఎంఐ కేప్ టౌన్‌పై 85 పరుగుల భారీ తేడాతో ప్రిటోరియా గెలుపు
న్యూ ఇయర్ వేడుకల వేళ దక్షిణాఫ్రికా టీ20 (SA20) లీగ్‌లో సిక్సర్ల బాణాసంచా పేలింది. ప్రిటోరియా క్యాపిటల్స్ బ్యాటర్లు షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, డెవాల్డ్ బ్రెవిస్ సిక్సర్ల వర్షంతో మైదానం తడిసి ముద్దయింది. వీరిద్దరూ కలిసి వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది ఎంఐ కేప్ టౌన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.

ప్రిటోరియా ఇన్నింగ్స్ 17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 148/5గా ఉంది. ఆ తర్వాతే అసలైన విధ్వంసం మొదలైంది. కోర్బిన్ బాష్ వేసిన 18వ ఓవర్ చివరి రెండు బంతులను 'బేబీ ఏబీ' డెవాల్డ్ బ్రెవిస్ వరుసగా రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. మరుసటి ఓవర్ వేయడానికి వచ్చిన డ్వైన్ ప్రిటోరియస్‌పై రూథర్‌ఫోర్డ్ విరుచుకుపడ్డాడు. మొదటి నాలుగు బంతులను వరుసగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఇలా ఇద్దరు బ్యాటర్లు కలిసి వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చివరి 3 ఓవర్లలోనే ఏకంగా 72 పరుగులు రావడం విశేషం. రూథర్‌ఫోర్డ్ 15 బంతుల్లో 6 సిక్సర్లతో 47 పరుగులు చేయగా, బ్రెవిస్ 13 బంతుల్లో 4 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

అంతేకాదు, ఎంఐ కేప్ టౌన్ ఛేజింగ్‌లో కూడా సిక్సర్ల హంగామా కొనసాగింది. వెస్టిండీస్ వీరుడు నికోలస్ పూరన్ కేవలం 6 బంతుల్లోనే 4 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. కేశవ్ మహరాజ్ వేసిన ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. కానీ మహరాజ్ అతడిని అవుట్ చేయడంతో ఎంఐ కేప్ టౌన్ ఆశలు ఆవిరయ్యాయి.

మరోవైపు, పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్ మార్కో జాన్సెన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎస్ఏ20 లీగ్ చరిత్రలో 50 వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతడు 2 వికెట్లు పడగొట్టడంతో అతడి మొత్తం వికెట్ల సంఖ్య 51కి చేరింది.
Sherfane Rutherford
SA20 League
Dewald Brevis
Pretoria Capitals
MI Cape Town
Nicholas Pooran
Marco Jansen
Cricket
South Africa T20 League
Sixes

More Telugu News