Hyderabad Fog: హైదరాబాద్ శివారులో దట్టమైన పొగమంచు.. స్తంభించిన ట్రాఫిక్

Hyderabad Fog Causes Traffic Jams Near City Outskirts
  • హైదరాబాద్ శివారు ప్రాంతాలను కమ్మేసిన దట్టమైన పొగమంచు
  • ముందు వెళ్లే వాహనాలు కనిపించక ఇబ్బందులు పడ్డ డ్రైవర్లు
  • శంషాబాద్ హైవేపై 10 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్
  • విజయవాడ జాతీయ రహదారిపై లైట్ల వెలుతురులో వాహనాల రాకపోకలు
హైదరాబాద్ శివారు ప్రాంతాలను శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్లు, భవనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ హైవే, మేడ్చల్, తూంకుంట, శామీర్‌పేట, గండిపేట, మోకిల, పటాన్‌చెరు, వికారాబాద్, రాజేంద్రనగర్, ఆదిబట్ల తదితర ప్రాంతాల్లో జీరో విజిబిలిటీ నమోదైంది. దీంతో ఉదయాన్నే రోడ్లెక్కిన వాహనదారులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంతో పాటు బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డు పక్కనే నిలిపివేశారు. ఫలితంగా శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటు ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై కూడా మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

మరోవైపు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పది అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా పొగమంచు కురుస్తోంది. విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోవడంతో వాహనదారులు హెడ్ లైట్లు, ఇండికేటర్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉండటంతో వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Hyderabad Fog
Hyderabad
Fog
Traffic Jam
Ibrahimpatnam
Shamshabad Airport
Bangalore Highway
Winter
Weather
Zero Visibility

More Telugu News