సికింద్రాబాద్ వాసికి సైబర్ కేటుగాళ్ల వల.. రూ. 72 లక్షల స్వాహా

  • స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పేరుతో భారీ మోసం
  • సికింద్రాబాద్ వాసి నుంచి రూ. 72 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
  • ఫేస్‌బుక్ యాడ్ చూసి మోసగాళ్లను సంప్రదించిన బాధితుడు
  • అధిక లాభాలు, ఐపీఓల పేరుతో నమ్మించి టోకరా
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో అమాయకులను మోసగిస్తున్నారు. తాజాగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి (59)ని బురిడీ కొట్టించి ఏకంగా రూ. 72 లక్షలు కాజేశారు. బాధితుడు ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ స్టాక్ ట్రేడింగ్ ప్రకటనను చూసి ఆకర్షితుడయ్యాడు. వారిని సంప్రదించగా.. తాము ప్రముఖ ట్రేడింగ్ సంస్థకు చెందిన మార్కెటింగ్ మేనేజర్లుగా అవతలి వ్యక్తులు పరిచయం చేసుకున్నారు.

బాధితుడిని తొలుత ఓ వాట్సాప్ గ్రూపులో చేర్చి స్టాక్ టిప్స్, ఐపీఓ స్ట్రాటజీలు, మార్కెట్ విశ్లేషణలు చెబుతూ నమ్మకం కలిగించారు. అనంతరం ప్రైమ్ ట్రేడింగ్ గ్రూపులో చేర్పించి కేవైసీ (KYC) వివరాలు తీసుకున్నారు. మొదట్లో బాధితుడితో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టించి, లాభాలు వచ్చినట్లు చూపడమే కాకుండా.. వాటిని విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా కల్పించారు. దీంతో వారిని పూర్తిగా నమ్మిన బాధితుడు భారీగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాడు.

అదే అదనుగా భావించిన నేరగాళ్లు.. ప్రత్యేక ఐపీఓలు కేటాయిస్తున్నామని, అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. అలాగే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని, అది పెరగాలంటే ఇంకా డబ్బు పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేశారు. స్క్రీన్‌పై భారీ లాభాలు కనిపిస్తుండటంతో.. కమీషన్లు, వీఐపీ మెంబర్‌షిప్ ఛార్జీల పేరుతో బాధితుడి నుంచి విడతల వారీగా మొత్తం రూ. 72 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత అతడిని గ్రూప్ నుంచి తొలగించి, మెసేజ్‌లకు స్పందించడం మానేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News