గాలి జనార్దన్‌రెడ్డి ఇంటి ముందు ఘర్షణ.. కాంగ్రెస్ కార్యకర్త మృతి

  • బ్యానర్లు కట్టే విషయంలో ఎమ్మెల్యేలు నారా భరత్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ
  • గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు జరిగిన గొడవలో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త మృతి
  • పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీఛార్జి
  • గాల్లోకి కాల్పులు, బాష్పవాయు ప్రయోగం
కర్ణాటకలోని బళ్లారి నగరంలో రాజకీయ ఆధిపత్య పోరు రక్తపాతానికి దారితీసింది. ఒక బ్యానర్ ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు, కాల్పులకు దారితీయగా.. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు మృతి చెందారు. గంగావతి ఎమ్మెల్యే, కేఆర్‌పీపీ నేత గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

వివరాల్లోకి వెళితే...

బళ్లారి నగరంలో జనవరి 3న వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక బ్యానర్‌ను బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు, హవాంబవి ప్రాంతంలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీనిని జనార్దన్ రెడ్డి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా రాళ్ల దాడికి, ఆపై కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త, బళ్లారి హుస్సేన్ నగర్ నివాసి అయిన రాజశేఖర్ (28) అక్కడికక్కడే మృతి చెందారు.

ఘటన అనంతరం ఇరు వర్గాలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువును ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి, భారీగా పోలీసులను మోహరించారు. ఘటన జరిగిన రోజే బళ్లారి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పవన్ నెజ్జూర్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

పరస్పరం తీవ్ర ఆరోపణలు

ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి, నారా భరత్ రెడ్డి పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. "ఇది నాపై జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యాయత్నం. నేను ఇంటికి వస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్‌మెన్లు 4-5 రౌండ్లు కాల్పులు జరిపారు. భరత్ రెడ్డి, ఆయన తండ్రి సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి నా హత్యకు కుట్ర పన్నారు" అని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కొన్ని బుల్లెట్ షెల్స్‌ను ఆయన మీడియాకు చూపించారు.

మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఈ ఆరోపణలను ఖండించారు. "మా కార్యకర్త హత్యకు జనార్దన్ రెడ్డే కారణం. వాల్మీకి పేరుతో దశాబ్దాలుగా రాజకీయం చేసిన బీజేపీ, ఇప్పుడు ఆయనే వాల్మీకికి వ్యతిరేకిగా మారారు. శాంతియుతంగా ఉన్న బళ్లారిలో అలజడి సృష్టించేందుకే ఈ కుట్ర చేశారు. జనార్దన్ రెడ్డిని, ఆయన సోదరుడిని తక్షణమే అరెస్ట్ చేయాలి" అని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, రాజశేఖర్ మృతికి కారణమైన బుల్లెట్ ఎవరి తుపాకీ నుంచి పేలిందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో బళ్లారిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.


More Telugu News