Stock Market: బ్యాంకింగ్ షేర్ల జోరు.. రెండు రోజుల నష్టాలకు బ్రేక్

Stock Market Breaks Two Day Losing Streak with Banking Sector Surge
షార్ట్స్‌లో చూడండి
రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో చివరి గంటలో వెల్లువెత్తిన కొనుగోళ్లతో సూచీలు పరుగులు పెట్టాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 650.39 పాయింట్లు లాభపడి 83,277.15 వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ 211.65 పాయింట్లు పెరిగి 25,682.75 వద్ద నిలిచింది.

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, నిఫ్టీకి 25,500-25,400 పాయింట్ల శ్రేణి కీలక మద్దతుగా ఉంది. ఈ స్థాయిని కాపాడుకున్నంత కాలం మార్కెట్ సానుకూలంగానే ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఎగువన 25,700-25,800 వద్ద నిరోధం ఉందని, దానిని దాటితే 25,900-26,000 స్థాయిలకు చేరవచ్చని విశ్లేషకులు తెలిపారు.

ఈ రోజు ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు మార్కెట్ రికవరీకి నాయకత్వం వహించాయి. సెన్సెక్స్ షేర్లలో పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ 4.5 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటివి నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే రియల్టీ, పీఎస్‌యూ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించగా, ఆటో, మెటల్ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.

అయితే, క్యాపిటల్ మార్కెట్ ఎక్స్‌పోజర్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను సవరించడంతో బీఎస్ఈ, ఏంజెల్ వన్, ఎంసీఎక్స్ వంటి షేర్లు 10 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు, డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 90.62 వద్ద దాదాపు స్థిరంగా ట్రేడ్ అయింది.
Go Back to Shorts
Stock Market
Indian Stock Market
Sensex
Nifty
Banking Shares
RBI
Rupee
HDFC Bank
Axis Bank
Market Analysis

More Telugu News