ఐదో టీ20 కూడా మనదే.. లంకను వైట్ వాష్ చేసిన టీమిండియా

  • శ్రీలంకతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా విజయం
  • కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్
  • చివర్లో మెరుపులు మెరిపించిన అరుంధతి రెడ్డి
  • లంక ఇన్నింగ్స్ లో హసిని పెరీరా, ఇమేషా దులారి పోరాడినా దక్కని ఫలితం
  • సమష్టిగా రాణించిన భారత బౌలర్లు
  • 5-0తో సిరీస్ ముగించిన హర్మన్ ప్రీత్ సేన 
శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఈ ఉత్కంఠ పోరులో భారత మహిళల జట్టు 15 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో సిరీస్ ను భారత్ 5-0తో ముగించింది. తద్వారా లంకను వైట్ వాష్ చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమెకు తోడుగా అమన్‌జోత్ కౌర్ (21) నిలకడగా ఆడింది. ఇక ఇన్నింగ్స్ చివర్లో అరుంధతి రెడ్డి (27 నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ చమరి అటపట్టు (2) త్వరగానే పెవిలియన్ చేరింది. అయితే హసిని పెరీరా (65; 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమేషా దులారి (50; 39 బంతుల్లో 8 ఫోర్లు) రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించి భారత్‌ను భయపెట్టారు. వీరిద్దరూ అర్ధసెంచరీలతో రాణించినా.. కీలక సమయంలో భారత బౌలర్లు పుంజుకున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ లంక ఇన్నింగ్స్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ రాణా, వైష్ణవి శర్మ, శ్రీ చరణి, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీసి సమిష్టిగా రాణించారు. 

ఈ ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో శ్రీలంక జట్టు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ హర్మన్ ప్రీత్ సేన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.


More Telugu News