ధృవ్ ఎన్‌జీ.. ఈ హెలికాప్టర్ భద్రతపై ఆందోళన అక్కర్లేదు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

  • దిగ్విజయంగా పూర్తయిన హెచ్‌ఏఎల్ ధృవ్ ఎన్‌జీ తొలి విడత పరీక్ష
  • స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ట్విన్ ఇంజిన్ల వినియోగం
  • భద్రతాపరమైన అన్ని ఆందోళనలకు పరిష్కారం చూపామని మంత్రి వెల్లడి
  • గంటకు 285 కి.మీ వేగంతో 14 మంది ప్రయాణించే సామర్థ్యం
  • రక్షణ రంగం నుంచి పౌర విమానయాన రంగం వైపు హెచ్‌ఏఎల్ అడుగులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మంగళవారం మరో కీలక మైలురాయిని అధిగమించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ట్విన్ ఇంజిన్ 'ధృవ్ ఎన్‌జీ' (Dhruv NG) హెలికాప్టర్ తొలి విడత ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. గతంలో తలెత్తిన భద్రతాపరమైన ఆందోళనలన్నింటినీ ఈ కొత్త వెర్షన్‌లో పరిష్కరించామని స్పష్టం చేశారు.

ధృవ్ ఎన్‌జీ ప్రయోగం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇందులో అనేక మార్పులు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా పౌర విమానయాన అవసరాల కోసం కొత్తగా 'ఎమర్జెన్సీ విండో ఎగ్జిట్'ను ఏర్పాటు చేశామన్నారు. డీజీసీఏ సర్టిఫికేషన్ ప్రక్రియ కూడా సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 300 హెలికాప్టర్లు మాత్రమే ఉండగా, డిమాండ్ మాత్రం 1000 నుంచి 1500 వరకు ఉందని, ఈ కొరతను తీర్చడానికి విదేశాలపై ఆధారపడకుండా 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా హెచ్‌ఏఎల్‌ను ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

హెచ్‌ఏఎల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ హెలికాప్టర్ గరిష్టంగా 5,500 కిలోల బరువుతో టేకాఫ్ అవ్వగలదు. గంటకు 285 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ఛాపర్‌లో 14 మంది ప్రయాణికులు కూర్చునే వెసులుబాటు ఉంది. అధునాతన వైబ్రేషన్ కంట్రోల్ సిస్టమ్స్, గ్లాస్ కాక్‌పిట్‌తో ఇది వీఐపీ రవాణాకు, అత్యవసర వైద్య సేవలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా, పౌర విమానయాన రంగంలోకి హెచ్‌ఏఎల్ విస్తరించడం, పూర్తి స్వదేశీ ఇంజిన్‌తో విమానయాన రికార్డులు సృష్టించడం దేశానికి గర్వకారణమని రామ్మోహన్ నాయుడు కొనియాడారు.


More Telugu News