RailOne App: రైల్‌వన్ యాప్ లో టికెట్ల కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్... వివరాలు ఇవిగో!

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి ఊరటనిస్తూ ‘రైల్‌వన్’ (RailOne) యాప్ ద్వారా బుక్ చేసుకునే అన్‌రిజర్వ్‌డ్ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఆరు నెలల పాటు అందుబాటులో ఉండనుంది.

ఇప్పటివరకు రైల్‌వన్ యాప్‌లో కేవలం ఆర్-వాలెట్ (R-Wallet) ద్వారా టికెట్ కొనుగోలు చేస్తేనే 3 శాతం క్యాష్‌బ్యాక్ లభించేది. తాజా నిర్ణయంతో ఈ వెసులుబాటును అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు విస్తరించారు. ఇకపై యూపీఐ (UPI), డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా జనరల్ టికెట్ తీసుకున్నా 3 శాతం తగ్గింపు లభిస్తుంది. ఆర్-వాలెట్ ద్వారా జరిగే లావాదేవీలకు ప్రస్తుతం ఉన్న క్యాష్‌బ్యాక్ యథాతథంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

అయితే ఈ డిస్కౌంట్ కేవలం రైల్‌వన్ యాప్‌కు మాత్రమే పరిమితం. ఇతర ప్లాట్‌ఫామ్‌లు లేదా యూటీఎస్ (UTS) యాప్ ద్వారా బుక్ చేసే టికెట్లకు ఇది వర్తించదు. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)ను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మే నెలలో ఈ ఆఫర్ పనితీరు, ప్రయాణికుల స్పందనను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

రైల్వే సేవలన్నీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు రైల్‌వన్ సూపర్ యాప్‌ను రూపొందించారు. ఇందులో టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, రైలు ట్రాకింగ్ వంటి సేవలున్నాయి. ఈ కొత్త ఆఫర్ ద్వారా రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గుతుందని, ప్రయాణికులు డిజిటల్ విధానాల వైపు మొగ్గు చూపుతారని రైల్వే శాఖ భావిస్తోంది.
RailOne App
Indian Railways
Unreserved Tickets
Digital Payments
UTS App
R-Wallet
UPI
Discount Offer

More Telugu News