నాకే ఎందుకిలా జరుగుతోంది?: కన్నీళ్లు పెట్టుకున్న నందూ!

  • నటుడిగా ఫెయిల్ కాలేదన్న నందూ 
  • కొన్ని అవమానాలు మరిచిపోలేనని వ్యాఖ్య
  • తనని తప్పించడం పట్ల ఆవేదన  
  • పెద్ద ప్రాజెక్టులు జారిపోయాయని వెల్లడి 
  • తానే గ్యాప్ తీసుకున్నానని వివరణ 

నందూ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమవుతోంది. తనకి నచ్చిన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. తాజాగా 'ఇట్లు మీ జాఫర్' యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందూ అనేక విషయాలను ప్రస్తావించాడు. "నాతో కలిసి నటించిన వాళ్లంతా ఎక్కడికో వెళ్లిపోయారు. సిద్ధూ జొన్నలగడ్డ .. అంజలి .. విజయ్ దేవరకొండ .. ప్రియదర్శి ఇలా చాలామంది ఉన్నారు. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను" అని అన్నాడు. 

"నేను వెనకబడి పోవడానికి గల కారణాలను గురించిన ఆలోచన చేస్తే, లోపం నాలోనే ఉందనే విషయం ఈ మధ్యనే అర్థమైంది. కొన్ని సినిమాల విషయంలో రాజీపడటమే అందుకు ఒక కారణంగా నాకు కనిపించింది. నటుడిగా నేను ఫెయిల్ కాలేదు. కానీ నాకు తెలియకుండానే నా సినిమాలపై ఒక ముద్రపడిపోయింది. ఆ ముద్ర నుంచి బయటపడటానికి చాలాకాలం పట్టింది. నేను ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం, మంచి కథ కోసమే .. లీడ్ రోల్ కోసమే" అని చెప్పాడు. 

"ఒక పెద్ద బ్యానర్లో ఛాన్స్ వచ్చింది .. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఆ సినిమా ఆగిపోయింది .. కాకపోతే అంతకుముందే వాళ్లు నన్ను తీసేశారు. మరో పెద్ద బ్యానర్లో ఇద్దరు హీరోలలో ఒకరిగా నన్ను తీసుకున్నారు. కానీ నాకు చెప్పకుండా నా రోల్ ను వేరే వాళ్లతో రీ షూట్ చేశారు. చివరికి ఫంక్షన్ కి వెళ్లినా పట్టించుకోలేదు. కొంతమంది తెలుగు హీరోయిన్స్ నేను హీరోనని తెలిసి, కథ కూడా వినకుండా 'నో' చెప్పారు. వీటికి తోడు అనవసరమైన విషయాలలో నా పేరును ఇరికించడం కూడా ప్రభావం చూపింది. ఇవన్నీ చూసినప్పుడు అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని కూడా అనిపించింది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.



More Telugu News