ఏడేళ్ల పాటు కోమాలో ఉండి... తుదిశ్వాస విడిచిన శ్రీలంక యువ క్రికెటర్

  • 2018లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత ఏడేళ్లుగా కోమాలోనే అక్షు ఫెర్నాండో
  • మౌంట్ లావినియా బీచ్ సమీపంలో రన్నింగ్ చేస్తుండగా ఢీకొట్టిన రైలు
  • 2010 అండర్-19 వరల్డ్ కప్‌లో సత్తాచాటిన యువ ప్లేయర్
  • అక్షు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కామెంటేటర్ రోషన్ అబేసింఘే
శ్రీలంక క్రికెట్ వర్గాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీలంక యువ క్రికెటర్ అక్షు ఫెర్నాండో (Akshu Fernando) మంగళవారం కన్నుమూశాడు. సుమారు ఏడేళ్ల క్రితం జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అప్పటి నుంచి కోమాలోనే ఉన్న ఫెర్నాండో మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. అతడి వయసు ప్రస్తుతం 25 సంవత్సరాలు.

ఈ దుర్ఘటన 2018 డిసెంబర్ 28న జరిగింది. మౌంట్ లావినియా బీచ్ సమీపంలో రన్నింగ్ ప్రాక్టీస్ ముగించుకొని తిరిగి వస్తుండగా, రక్షణ లేని రైల్వే ట్రాక్‌ను దాటుతున్న సమయంలో అక్షు ఫెర్నాండోను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలవడంతో పాటు శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగాయి. అప్పటి నుంచి అతడు లైఫ్ సపోర్ట్‌పై చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇన్నాళ్లూ ఫెర్నాండో కోలుకుంటాడని ఆశతో సేవలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

అక్షు ఫెర్నాండో మృతి పట్ల అంతర్జాతీయ కామెంటేటర్ రోషన్ అబేసింఘే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. "అక్షు ఫెర్నాండో మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఒక క్రూరమైన ప్రమాదం కారణంగా అద్భుతమైన కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. అతడు ఎంతో మంచి వ్యక్తి, ప్రతిభావంతుడైన క్రికెటర్. అతని ఆత్మకు శాంతి కలగాలి" అని పేర్కొన్నాడు.

అక్షు ఫెర్నాండో 2010లో న్యూజిలాండ్‌లో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో 52 పరుగులు చేసి సత్తా చాటాడు. ప్రమాదానికి కేవలం రెండు వారాల ముందే, 2018 డిసెంబర్ 14న ఓ క్లబ్ మ్యాచ్‌లో మూర్స్ స్పోర్ట్స్ క్లబ్‌పై అజేయంగా 102 పరుగులు సాధించడం గమనార్హం. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడనుకున్న ఓ యువ కెరటం ఇలా రాలిపోవడం క్రీడాభిమానులను కలచివేస్తోంది.


More Telugu News