నేను సక్సెస్ కాలేదనే బాధ నాన్నకు ఉంది: కోటి తనయుడు రాజీవ్!

  • హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజీవ్  
  • సరైన కథల కోసం వెయిటింగ్ 
  • అందుకే గ్యాప్ వచ్చిందని వెల్లడి 
  • తండ్రి తలవంచడం నచ్చదని వ్యాఖ్య

 తెలుగు సినిమా పాటను పరిగెత్తించిన సంగీత దర్శకుడు కోటి. ఒకప్పుడు రాజ్ తో కలిసి ఆయన అందించిన హిట్స్, ఇప్పటికీ తమ జోరును చూపిస్తూనే ఉంటాయి. సాధారణంగా సంగీత నేపథ్యం నుంచి వచ్చిన వారసులు కూడా, సంగీతం వైపే ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. కానీ కోటి తనయుడు రాజీవ్ మాత్రం, 'నోట్ బుక్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా వచ్చి చాలా కాలం అయినప్పటికీ, ఇంకా ఆయన సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. 

తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ మాట్లాడుతూ, నేను ఇంటర్ కాగానే చేసిన సినిమా 'నోట్ బుక్'. కొన్ని సినిమాలు చేసిన తరువాత, ముందుగా డిగ్రీ పూర్తిచేయాలనే ఉద్దేశంతో సినిమాలు పక్కన పెట్టాను. ఆ తరువాత సినిమాలు చేద్దామని ఉన్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. కథలైతే ఇప్పటికీ వింటూనే ఉన్నాను. ఇక్కడ ఎవరు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారనేది కాదు, సక్సెస్ ఉంటేనే అవకాశాలు వస్తాయి" అని అన్నాడు. 

"మా నాన్నకి ఇండస్ట్రీలో ఎంతటి గౌరవం ఉందనేది నాకు తెలుసు. ఆయన పెద్దపెద్ద దర్శకులతో .. నిర్మాతలతో కలిసి పనిచేయడం నాకు తెలుసు. ఆయన పేరు చెడ గొట్టకూడదనే ఆలోచన చేస్తూనే కెరియర్ ను ప్లాన్ చేస్తున్నాను. నేను ఇంతవరకూ సక్సెస్ కాలేకపోయాననే బాధ నాన్నకు ఉంది. అలాగని చెప్పి ఆయన నా కోసం ఎవరినీ ఛాన్స్ అడగరు. నేను అడగనీయను కూడా. నా  ప్రయత్నాలు నేను చేస్తూ వెళతాను" అని చెప్పాడు. 



More Telugu News