ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ థ్రిల్లర్!

  • హారర్ థ్రిల్లర్ గా వచ్చిన 'భయ్'
  • 8 ఎపిసోడ్స్ తో కూడిన సిరీస్ 
  • ఉత్కంఠను రేకెత్తించే కథాకథనాలు
  • తెలుగు ఆడియోలోను వచ్చే ఛాన్స్  
   
హారర్ థ్రిల్లర్ సిరీస్ ల పట్ల ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక యథార్థ సంఘటనలు ఆధారంగా అంటే ఆ సిరీస్ పై ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా 'అమెజాన్ ఎం ఎక్స్ ప్లేయర్'కి వచ్చిన ఒక హిందీ వెబ్ సిరీస్ ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఆ సిరీస్ పేరే 'భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ'. ఇది పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ గా పేరుపొందిన గౌరవ్ తివారీ జీవితానికి సంబంధించిన కథ. రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించగా, కరణ్ టాకర్ ప్రధానమైన పాత్రను పోషించాడు. 

'పాట్నా'కు చెందిన గౌరవ్ తివారీ పైలట్ గా పని చేస్తూ ఉంటాడు. ఒకానొక సంఘటన కారణంగా ఆయన దృష్టి దెయ్యాలు .. భూతాల దిశగా వెళుతుంది. దాంతో వాటికి సంబంధించిన పరిశోధనలు చేస్తూ ముందుకు వెళతాడు. పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ గా ఆయన ఎన్నో సమస్యలను పరిష్కరిస్తాడు. అలాంటి ఆయన ఊహించని విధంగా తన 32వ ఏట మరణిస్తాడు. ఆయన మరణం కూడా ఒక మిస్టరీగా మారిపోతుంది. 

8 ఎపిసోడ్స్ తో కూడిన ఈ సిరీస్ కూడా ఆయన మరణంతోనే మొదలవుతుంది. గౌరవ్ తివారీకి దెయ్యాల పట్ల ఎలా ఆసక్తి కలిగింది? ఆయనకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆయన చనిపోవడానికి ముందు ఏం జరిగింది? అనే అంశాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అక్కడక్కడా పలకరించే కొన్ని హారర్ సీన్స్ ను చూడాలంటే కాస్త గుండె ధైర్యం కావలసిందే. త్వరలోనే ఈ సిరీస్ కి తెలుగు ఆడియోను కూడా జోడించే అవకాశం ఉందనే చెప్పాలి.    




More Telugu News