ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు షాక్.. 12 ఏళ్ల కుర్రాడి చేతిలో పరాభవం

  • దోహా వేదికగా జరుగుతున్న వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం
  • 12 ఏళ్ల రష్యా ప్లేయర్ సెర్గీ స్లోకిన్ చేతిలో ఓడిన ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌
  • చివరి నిమిషంలో డ్రాను నిరాకరించి గెలుపు కోసం ప్రయత్నించిన గుకేశ్‌
  • సమయభావం వల్ల చేసిన చిన్న పొరపాటుతో చేజారిన గేమ్
ప్రపంచ చదరంగంలో మరో సంచలనం నమోదైంది. దోహా వేదికగా జరుగుతున్న ఫిడే (FIDE) వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌-2025లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి.గుకేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. కేవలం 12 ఏళ్ల వయసున్న రష్యా యువ సంచలనం సెర్గీ స్లోకిన్ చేతిలో గుకేశ్‌ ఓటమి పాలవ్వడం క్రీడాకారులను విస్మయానికి గురిచేసింది. మూడో రౌండ్‌లో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో చివరి నిమిషంలో చేసిన ఒకే ఒక్క తప్పిదం అత‌ని కొంపముంచింది.

నల్ల పావులతో ఆడుతున్న గుకేశ్‌కు గేమ్ 70వ ఎత్తు వద్ద తీవ్రమైన సమయ ఒత్తిడి ఏర్పడింది. చేతిలో కేవలం 8 సెకన్ల సమయం మాత్రమే ఉంది. ఈ దశలో ప్రత్యర్థి స్లోకిన్ డ్రా చేసుకునే ఉద్దేశంతో రూక్ ఎక్స్చేంజ్ (ఏనుగుల మార్పిడి) ఆఫర్ చేశాడు. సాధారణంగా అది డ్రా అయ్యే గేమ్. కానీ, దూకుడుగా ఆడుతూ ఎప్పుడూ గెలుపునే కోరుకునే గుకేశ్‌, ఆ డ్రా ఆఫర్‌ను తిరస్కరించి తన రూక్‌ను 'f4'కి జరిపాడు.

గెలుపు కోసం గుకేశ్‌ చేసిన ఈ సాహసం బెడిసికొట్టింది. ఆ తర్వాతి కొద్ది ఎత్తుల్లోనే గుకేశ్‌ తన బిషప్‌ను, చివరి పాన్‌ను కోల్పోవాల్సి వచ్చింది. పరిస్థితి పూర్తిగా చేజారిపోవడంతో మరో పది ఎత్తుల్లోనే గుకేశ్‌ తన ఓటమిని అంగీకరించాడు.

ఈ గేమ్ గురించి ప్రముఖ గ్రాండ్‌మాస్టర్ మారిస్ యాష్లే మాట్లాడుతూ.. "గుకేశ్‌ పోరాట పటిమ గొప్పదే. అతను డ్రా చేసుకోవడాన్ని అస్సలు ఇష్టపడడు. కానీ, ఈసారి అది మరీ ఎక్కువైంది. వాస్తవానికి అక్కడ డ్రా చేసుకోవడమే సరైన నిర్ణయం. అతను గెలుపు కోసం అనవసర రిస్క్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఒక ప్రపంచ ఛాంపియన్ నుంచి ఇలాంటి నిర్ణయం ఊహించలేదు" అని వ్యాఖ్యానించారు.

టోర్నీకి ముందు గుకేశ్‌ మాట్లాడుతూ.. తనకు క్లాసికల్ ఫార్మాటే ప్రధానమని, అయితే ఈ మధ్య కాలంలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లపై కూడా కాస్త సీరియస్‌గా దృష్టి పెట్టానని తెలిపాడు. కాగితంపై రేటింగ్ పరంగా గుకేశ్‌ (2628) ఎంతో ముందున్నప్పటికీ, బ్లిట్జ్ చెస్‌లో క్షణాల్లో తీసుకునే నిర్ణయాలే ఫలితాన్ని తారుమారు చేస్తాయని ఈ గేమ్ నిరూపించింది. ప్రపంచ విజేతగా రికార్డులు సృష్టిస్తున్న గుకేశ్‌కు ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోగా, 12 ఏళ్ల స్లోకిన్‌కు మాత్రం ఇది తన కెరీర్‌ను మలుపు తిప్పే విజయం.


More Telugu News