పవన్ కల్యాణ్, ప్రభాస్‌ల సేవా కార్యక్రమాలను వెల్లడించిన సుమ
- ఖమ్మం జిల్లాలో వృద్ధాశ్రమానికి పవన్, ప్రభాస్ సాయం చేస్తున్నారన్న సుమ
- ప్రభాస్ ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తున్నారని వెల్లడి
- ఇది ప్రభాస్ నిజమైన వ్యక్తిత్వమని ప్రశంస
తెలుగు సినిమా హీరోలు భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. కొందరు ట్రోలింగ్ కోసమే కామెంట్స్ చేస్తుంటారు. కానీ, అదే సమయంలో మన స్టార్స్ నిశ్శబ్దంగా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటి వెలుగులోకి రాని మంచి పనులు బయటపడినప్పుడు, ఈ ట్రోల్స్ ఎంత అర్థరహితమో అర్థమవుతుంది.
తాజాగా, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఓ ఆసక్తికరమైన, హృదయాన్ని తాకే విషయాన్ని బయటపెట్టారు. ఖమ్మం జిల్లాలో నిర్మించిన ఓ వృద్ధాశ్రమానికి పవన్ కల్యాణ్, ప్రభాస్‌లు ఎంతో కీలకమైన సహాయం అందించారని సుమ వెల్లడించారు. ఆ వృద్ధాశ్రమం నిర్మాణంలో వీరిద్దరితో పాటు మరికొందరు దాతలు కూడా భాగస్వాములయ్యారని తెలిపారు. ముఖ్యంగా ప్రభాస్ విషయంలో సుమ చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సుమ వెల్లడించిన వివరాల ప్రకారం... ప్రభాస్ కేవలం వృద్ధాశ్రమం నిర్మాణానికి సహాయం చేయడమే కాకుండా, అక్కడ నివసిస్తున్న వృద్ధుల ఆరోగ్యం, ఆహారం, అవసరాల కోసం ప్రతి నెలా తనవంతు ఆర్థిక సాయం చేస్తుంటారు. ఎలాంటి ప్రచారం లేకుండా, ఎవరికీ తెలియకుండా చేసే ఈ సేవలే ప్రభాస్ నిజమైన వ్యక్తిత్వానికి నిదర్శనమని సుమ పేర్కొన్నారు. ఈ విషయం ఇంతకాలం బయటకు రాకపోయినా, ఇప్పుడు వెలుగులోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.