ప్రియాంక గాంధీ ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు!

  • సన్నిహితుల మధ్య రేహాన్ వాద్రా ఎంగేజ్ మెంట్
  • రేహాన్ తన స్నేహితురాలిని పెళ్లాడనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు
  • అధికారికంగా ప్రకటించని ప్రియాంక, రాబర్ట్ వాద్రా
వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా తన స్నేహితురాలు అవీవా బేగ్ ను పెళ్లాడనున్నారు. తాజాగా సన్నిహిత బంధువుల సమక్షంలో రేహాన్, అవీవాల ఎంగేజ్ మెంట్ జరిగిందని జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. విజువల్‌ ఆర్టిస్ట్‌ అయిన రేహాన్ వాద్రా వైల్డ్‌లైఫ్‌, స్ట్రీట్‌, కమర్షియల్‌ ఫొటోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అవీవా కూడా ఫొటోగ్రాఫర్ గా, ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్నారు.

ఏడేళ్లుగా వీరు స్నేహితులని, ఇటీవల రేహాన్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా అవీవా అంగీకరించిందని తెలుస్తోంది. అవీవా బేగ్ కుటుంబంతో వాద్రా కుటుంబానికి స్నేహసంబంధాలు ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే రేహాన్, అవీవాల ప్రేమకు ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయని, నిశ్చితార్థం జరిపించాయని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, రేహాన్ ఎంగేజ్ మెంట్ పై వాద్రా కుటుంబం  నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


More Telugu News