మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన కర్ణాటక ప్రభుత్వం

  • డిసెంబర్ 31న ఉదయం 6 గంటల నుంచే మద్యం విక్రయాలు
  • బార్‌లు, పబ్‌లు, వైన్ షాపులు, ఇతర మద్యం విక్రయ కేంద్రాలన్నింటికీ వర్తింపు
  • అర్ధరాత్రి 1 గంటకు కార్యక్రమాలు ముగించాలని ఆదేశం

2025కి గుడ్‌బై చెప్పి 2026కి ఘనంగా స్వాగతం పలికేందుకు దేశమంతా రెడీ అవుతోంది. మరోవైపు, ప్రతీ ఏడాది డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుండటం తెలిసిందే. ఈ అవకాశాన్ని మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం మద్యం విక్రయాల సమయాలపై కీలక నిర్ణయం తీసుకుంది.


న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన ఉదయం 6 గంటల నుంచే మద్యం విక్రయాలకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. సాధారణంగా ఆలస్యంగా ప్రారంభమయ్యే లిక్కర్ సేల్స్ ఈసారి తెల్లవారుజామునే మొదలుకానున్నాయి. అయితే ఈ వెసులుబాటు ఒక్కరోజుకు మాత్రమే పరిమితం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే డిసెంబర్ 31 ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే ఈ సడలింపు అమల్లో ఉంటుంది.


ఈ నిర్ణయం బార్‌లు, పబ్‌లు, వైన్ షాపులు, ఇతర మద్యం విక్రయ కేంద్రాలన్నింటికీ వర్తిస్తుంది. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎదురుచూస్తున్న మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన నిబంధనల్ని కూడా అమలు చేస్తోంది.


ఇక ప్రైవేట్ పార్టీలకు అనుమతి ఇచ్చే సీఎల్–5 లైసెన్స్ కలిగిన నిర్వాహకులకూ ఇదే టైమ్ లిమిట్ వర్తిస్తుంది. సాధారణ రోజుల్లో 24 గంటల పాటు మద్యం సరఫరా చేసే అవకాశం ఉన్నా, 31వ తేదీన మాత్రం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట లోపే కార్యక్రమాలు ముగించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా మద్యం విక్రయాలు లేదా సరఫరా కొనసాగిస్తే లైసెన్స్ రద్దుతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. సెలబ్రేషన్స్ ఆనందంగా జరుపుకోవాలి కానీ చట్టానికి లోబడి ఉండాలనే సందేశాన్ని ప్రభుత్వం బలంగా ఇస్తోంది.



More Telugu News