హ్యాష్ ట్యాగ్ లు, ఆందోళనలపై న్యాయం ఆధారపడదు.. ఉన్నావ్ రేప్ కేసు దోషి కుమార్తె

  • ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం ఓపిగ్గా వేచి చూస్తున్నామని వ్యాఖ్య
  • ఎక్స్ లో సుదీర్ఘ లేఖ రాసిన సెంగర్ కుమార్తె ఇషితా సెంగర్
  • అవమానాలు తమకు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన
  • కోర్టు తమ వాదన వినిపించుకోలేదని వెల్లడి
ఉన్నావ్ అత్యాచార కేసులో ట్రయల్ కోర్టు దోషిగా తేల్చిన మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కు తాజాగా సుప్రీంకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఆయనకు విధించిన జీవితఖైదును తోసిపుచ్చిన హైకోర్టు.. ఇటీవల బెయిల్ కూడా మంజూరు చేసింది. దీనిపై బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సోమవారం విచారించిన సుప్రీంకోర్టు సెంగర్ బెయిల్ పై స్టే విధిస్తూ, హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. 

ఈ క్రమంలో సెంగర్ కుమార్తె ఇషితా సెంగర్ ‘ఎక్స్’ లో ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ దేశంలో న్యాయం ‘హ్యాష్ ట్యాగ్ లు, ఆందోళనల’ పై ఆధారపడదని, న్యాయం కోసం తాము ఎనిమిదేళ్లుగా ఓపిగ్గా ఎదురుచూస్తున్నామని పేర్కొంది.

అయితే, సోమవారం నాటి సుప్రీంకోర్టు తీర్పు తమకు తీవ్ర ఆవేదన మిగిల్చిందని తెలిపింది. ఈ కేసులో తమ వాదనలు కనీసం వినిపించుకోకుండా, కేసులోని మెరిట్లను పట్టించుకోకుండా అత్యున్నత న్యాయస్థానం ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె’ అన్న ముద్ర కారణంగా తాను వెల్లడిస్తున్న నిజాలను న్యాయస్థానాలతో పాటు ఎవరూ కనీసం వినడం లేదని ఇషిత చెప్పారు. ఇది తమ నమ్మకాన్ని బలహీనం చేస్తోందని అన్నారు. అయితే, తమకు మరో ప్రత్యామ్నాయం లేక ఎప్పటికైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో న్యాయస్థానాలపై నమ్మకం పెంచుకుంటున్నామని వివరించారు.
 
అవమానాలు, బెదిరింపులు నిత్యకృత్యం
ఎనిమిదేళ్లుగా జైలులో ఉన్న తన తండ్రికి న్యాయం జరగాలని తమ కుటుంబం పోరాడుతోందని ఇషిత చెప్పారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో బెదిరింపులు, అవమానాలు ఎదుర్కోని రోజంటూ లేదన్నారు. సోషల్ మీడియా వేదికగా తనకు లెక్కలేనన్నిసార్లు అత్యాచారం, హత్య బెదిరింపులు వచ్చాయని ఇషిత తెలిపారు. తమ కుటుంబంపై ఈ ద్వేషం ఇంకా కొనసాగుతోందని, బయట ప్రతిరోజూ తాము అవమానాలను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా పూర్తిగా కృశించిపోయామని పేర్కొన్నారు.
 
పదే పదే స్టేట్మెంట్లు మార్చిన బాధితురాలు..
ఈ కేసులో బాధితురాలుగా పేర్కొంటున్న మహిళ పోలీసులకు, కోర్టులకు ఇచ్చిన స్టేట్మెంట్‌ ను ఇప్పటి వరకు మూడుసార్లు మార్చిందని ఇషిత చెప్పారు. రేప్ జరిగిందని చెబుతున్న సమయం విషయంలో ఒక్కో స్టేట్మెంట్లో ఒక్కో సమయాన్ని పేర్కొందని ఆరోపించారు. ఒకసారి మధ్యాహ్నం 2 గంటలకు తనపై అత్యాచారం జరిగిందని, మరోసారి సాయంత్రం 6 గంటలకని, మళ్లీ రాత్రి 8 గంటలకు అంటూ మూడుసార్లు మార్చిమార్చి చెప్పిందన్నారు. అత్యాచారం జరిగిందని చెబుతున్న సమయంలో తాను మైనర్ అన్న బాధితురాలు ఆరోపణను ఎయిమ్స్ మెడికల్ బోర్డు తోసిపుచ్చిందని ఇషిత గుర్తుచేశారు. ఆ సమయంలో బాధితురాలి వయస్సు 18 సంవత్సరాలకు పైనే ఉంటుందని తన నివేదికలో పేర్కొందన్నారు.

ఇప్పటికీ కోర్టులపై నమ్మకం ఉంది..
అత్యాచారం జరిగిందని చెబుతున్న సమయంలో బాధితురాలు ఫోన్ లో మాట్లాడుతోందని రికార్డు కూడా ఉందని ఇషిత చెప్పారు. ఇన్ని మెరిట్లు ఉన్నప్పటికీ కోర్టు కనీసం తమ వాదన కూడా వినిపించుకోలేదన్నారు. తమ కుటుంబం ఆవేదన పట్టించుకోనక్కర్లేదని కోర్టులు భావిస్తున్నాయని చెప్పారు. ‘కుటుంబం పరువు కోల్పోయాం.. మనశ్శాంతిని కోల్పోయాం.. చివరకు మా వాదన వినిపించే ప్రాథమిక హక్కునూ మేం కోల్పోయాం. అయినాసరే, ఇప్పటికీ మాకు కోర్టులపై నమ్మకం ఉంది’ అంటూ ఇషిత పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దంటూ మీడియాకు ఈ సందర్భంగా ఇషిత విజ్ఞప్తి చేశారు.


More Telugu News