iBomma Ravi: ఇది కదా ట్విస్ట్ అంటే... 'ఐబొమ్మ' నాది అని ఎవరు చెప్పారని ప్రశ్నించిన ఐబొమ్మ రవి

Ravi of iBomma Questioned Media on Piracy Allegations
  • తన పేరు ఐబొమ్మ రవి కాదన్న రవి
  • బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశానని మీరెలా చెబుతారని మీడియాకు ప్రశ్న
  • తాను అన్ని విషయాలు కోర్టులోనే చెబుతానని వ్యాఖ్య

మీడియా ప్రతినిధుల ముందే ఎదురుదాడికి దిగిన ఐ బొమ్మ రవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. తనపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించిన రవి, “నా పేరు ఐ బొమ్మ రవి కాదు. ఐ బొమ్మ నాది అని మీకు ఎవరు చెప్పారు?” అంటూ మీడియాను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు.


నిన్న పోలీస్ కస్టడీ ముగిసిన అనంతరం రవిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ కోరగా, కోర్టు రిమాండ్ విధించడంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. రవిని కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు.


మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కాకుండా, వారికే రవి తిరిగి ప్రశ్నలు సంధించాడు. “నేను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశానని మీరు ఎలా చెబుతున్నారు? మీ దగ్గర ఆధారాలేమైనా ఉన్నాయా? పోలీసులు చెబితే అదే నిజమా? మీడియా కోర్టు కాదు, నేను కోర్టులోనే మాట్లాడతాను” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. అలాగే విదేశాలకు పారిపోయారనే ఆరోపణలను కూడా ఖండిస్తూ.. తాను ఎక్కడికీ పారిపోలేదని, కూకట్‌పల్లిలోనే ఉన్నానని స్పష్టం చేశాడు.


ఇక విచారణలో పోలీసులు షాక్‌కు గురిచేసే విషయాలు గుర్తించినట్లు సమాచారం. రవి తన అసలు గుర్తింపును దాచేందుకు ఇతరుల పత్రాలను దుర్వినియోగం చేసినట్లు తేలింది. మొదట తన స్నేహితుడు ప్రహ్లాద్ ధ్రువపత్రాలతో పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నానని రవి చెప్పాడు. తీరా ప్రహ్లాద్‌ను విచారించగా... అతనికి రవి ఎవరో కూడా తెలియదని వెల్లడైంది.


పోలీసుల విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. రవి జిరాక్స్ ధ్రువపత్రాలను అక్రమంగా సేకరించి, ఫొటో మాత్రమే మార్చి, మధ్యవర్తుల సహాయంతో ప్రభుత్వ గుర్తింపు పత్రాలు పొందినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో బ్యాంక్ ఖాతాల విషయంలోనూ తీవ్ర అక్రమాలు జరిగినట్లు సమాచారం.


రవికి చెందిన బ్యాంక్ ఖాతాలు అంజయ్య అనే పేరుతో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అయితే అంజయ్యను విచారించగా.. అతనికి రవి తెలియదని, రవికీ అంజయ్య ఎవరో తెలియదని తేలింది. దీంతో అంజయ్య ధ్రువపత్రాలను కూడా దుర్వినియోగం చేసి బ్యాంకు అధికారులను మోసం చేసి ఖాతాలు తెరిచినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

iBomma Ravi
iBomma
Ravi
movie piracy
betting apps
police investigation
fake documents
Anjaiah
Prahlad
Kukatpally

More Telugu News