Gold: భారత జీడీపీ కంటే.. ఇళ్లలోని బంగారం విలువే ఎక్కువ.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌ లక్ష‌ల కోట్ల ప‌సిడి నిల్వ‌లు!

Indian Gold Holdings Exceed India GDP Says Report
  • భారతీయుల వద్ద 34,600 టన్నుల పసిడి నిల్వలు ఉన్నట్లు అంచనా
  • రికార్డు స్థాయికి చేరడంతో 5 లక్షల కోట్ల డాలర్లు దాటిన విలువ
  • ఇటీవల 75 టన్నుల మేర బంగారం కొనుగోలు చేసిన ఆర్బీఐ
భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ మరో సంచలనానికి దారితీసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ దేశ ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) పరిమాణాన్ని మించిపోయింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,500 డాలర్లు దాటడంతో ఈ పరిస్థితి నెలకొంది. మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం.. భారతీయ ఇళ్లలో దాదాపు 34,600 టన్నుల బంగారం నిల్వ ఉంది.

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం లెక్కగడితే.. భారతీయుల వద్ద ఉన్న ఈ బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్ల  కంటే ఎక్కువ. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనాల ప్రకారం భారత జీడీపీ సుమారు 4.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అంటే దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయం కంటే ప్రజల ఇళ్లలో ఉన్న పసిడి విలువే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఈ అంశంపై ఇన్ఫోమెరిక్స్ వాల్యుయేషన్ అండ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ మనోరంజన్ శర్మ ఎకనామిక్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. "జీడీపీ అనేది ఒక ప్రవాహం లాంటిది, బంగారం అనేది నిల్వ ఉండే ఆస్తి. ఈ రెండింటిని నేరుగా పోల్చలేం. కానీ, భారత ఆర్థిక వ్యవస్థలో బంగారానికి ఉన్న సామాజిక, ఆర్థిక, మానసిక ప్రాధాన్యతను ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి" అని విశ్లేషించారు.

సంపద పెరుగుతుందా?
బంగారం విలువ పెరగడం వల్ల గృహాల బ్యాలెన్స్ షీట్లు బలపడతాయని మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు చెబుతున్నప్పటికీ, దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎమ్కే గ్లోబల్ విశ్లేషణ ప్రకారం.. ఇళ్లలో ఉండే బంగారంలో దాదాపు 75 నుంచి 80 శాతం ఆభరణాల రూపంలోనే ఉంటుంది. భారతీయులు దీన్ని పొదుపుగా భావిస్తారు తప్ప, విక్రయించి సొమ్ము చేసుకునే ఆస్తిగా చూడరు. అందుకే ధరలు పెరిగినా వినియోగంపై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు అంటున్నారు.

ఆర్బీఐ కూడా..
కేవలం ప్రజలే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంటోంది. 2024 నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ సుమారు 75 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో మొత్తం నిల్వలు 880 టన్నులకు చేరాయి. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారం సురక్షితమైన పెట్టుబడి కావడంతో కేంద్ర బ్యాంకులు కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఆర్థిక పరంగా చూస్తే బంగారం ఒక ఉత్పాదకత లేని ఆస్తి అని, ప్రజలు ఈటీఎఫ్ వంటి బాండ్ల వైపు మళ్లాలని నిపుణులు సూచిస్తున్నా, భౌతిక బంగారంపై మోజు మాత్రం తగ్గడం లేదు.
Gold
Indian Gold
India GDP
RBI Gold Reserves
Gold Price
Indian Economy
Morgan Stanley
IMF
Manoranjan Sharma
Gold Investment

More Telugu News