టీవీ సీరియల్ నటి నందిని ఆత్మహత్య
- తమిళ టెలివిజన్ రంగంలో విషాదం
- సీరియల్ నటి నందిని ఆత్మహత్య
- సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్న నటి
- నందిని మన తెలుగు అమ్మాయే
తమిళ టెలివిజన్ రంగంలో తక్కువ వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీరియల్ నటి నందిని (20) ఆత్మహత్యకు పాల్పడటం ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నందిని గది నుంచి ఒక సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ లేఖలో కుటుంబ సభ్యులు తనపై పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఆ మానసిక వేదనను తట్టుకోలేకపోయానని నందిని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
సన్నిహితుల కథనం ప్రకారం... గత కొన్ని రోజులుగా నందిని తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతోందని సమాచారం. కెరీర్ పరంగా ఎదుగుతున్న దశలోనే వ్యక్తిగత సమస్యలు ఆమెను కుంగదీసినట్లు తెలుస్తోంది.
నందిని తెలుగమ్మాయే అయినప్పటికీ, ముందుగా కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదటి సీరియల్‌తోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలో ప్రసారమైన ‘గౌరీ’ సీరియల్ ద్వారా చాలా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆ సీరియల్‌లో ఆమె చేసిన ద్విపాత్రాభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
కేవలం 20 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది. సోషల్ మీడియాలో నందిని మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. పలువురు నటులు, అభిమానులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, సంతాపం తెలుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, సూసైడ్ లెటర్ ఆధారంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులను విచారిస్తున్నారు.